హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): కృష్ణా డెల్టా సిస్టమ్, కేసీ కెనాల్‌కు కింద నీటి వినియోగ సామర్థ్యాలను పెంచుకోవాలని, అందుకు అవసరమైన టెక్నాలజీ అందుబాటులో ఉన్నదని ఏపీ సర్కారుకు తెలంగాణ తరఫు సాక్షి, వ్యవసాయరంగ నిపుణుడు పళనిస్వామి సూచించారు. ప్రాజెక్టుల వారీగా తెలంగాణ, ఏపీకి కృష్ణా జలాల కేటాయింపునకు సంబంధించి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ ఢిల్లీలో బుధవారం కొనసాగింది. తెలంగాణ తరఫు సాక్షి పళనిస్వామి వాదనలను ఏపీ అడ్వకేట్ వెంకటరమణి క్రాస్‌ఎగ్జామిన్ చేశారు.
ఈ సందర్భంగా కేసీ కెనాల్, కృష్ణా డెల్టా సిస్టమ్ కింద ప్రస్తుతమున్న సాగునీటి విధానమే కొనసాగాలని, నీటి పొదుపు చేపట్టేందుకు క్షేత్రస్థాయిలో అనేక అడ్డంకులు ఉన్నాయని ఏపీ వాదించింది. దీన్ని పళనిస్వామి ఖండించారు. నీటి పొదుపుకు అధునాతన టెక్నాలజీలు అందుబాటులో ఉన్నాయని, వాటిని అమలుచేసి నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచాలని వెల్లడించారు. కేసీ కెనాల్, కృష్ణా డెల్టా సిస్టమ్‌ను 60 శాతం ఎఫీషియెన్సీతో ప్రతిపాదించారని, కానీ కేవలం 40-28 శాతం మేరకు నీటి ఎఫీషియెన్సీ ఉన్నదని, అది సరికాదని నొక్కిచెప్పారు. తన వాదనలకు సంబంధించి అనేక డాక్యుమెంట్లు, జర్నల్స్, ఆధార పత్రాలను ట్రిబ్యునల్‌కు అందజేశారు. అనంతరం విచారణను ట్రిబ్యునల్ మే 18కి వాయిదా వేసింది.