హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): ‘అమ్మ పెట్టదు.. అడుక్కోనీయదు..’ అన్న చందంగా తయారయ్యింది కేంద్రం తీరు. ఎఫ్ఆర్బీఎం (ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్) పరిమితికి లోబడి జీఎస్డీపీలో 3.5శాతం రుణాలు తెచ్చుకొనేందుకు అనుమతిచ్చిన కేంద్రం ఇప్పుడు దానికో తిరకాసు పెట్టింది. మరో 0.5 శాతం రుణం అదనంగా తెచ్చుకొనేందుకు అనుమతిస్తూనే ఆ మొత్తాన్ని విద్యుత్తు రంగంపై ఖర్చుపెట్టాలని షరతు విధించింది. దీంతో విద్యుత్తు సంస్థల ప్రైవేటీకరణకు దారితీసేలా ఉన్న విద్యుత్తు సవరణ చట్టం బిల్లును వ్యతిరేకిస్తున్న తెలంగాణకు ఈ అదనపు 0.5 శాతం నిధులు రానట్టేననేది స్పష్టమవుతున్నది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 293(3) సెక్షన్ ప్రకారం ఆయా రాష్ర్టాల సంపద (జీఎస్డీపీ) మొత్తంలో 3 శాతం వరకే అప్పు తీసుకునే పరిమితి ఉంది. దీనిని కొద్ది సంవత్సరాల క్రితం కేంద్రం 3.5 శాతానికి పెంచింది. ఈ పరిమితిని అనేక రాష్ర్టాలు అతిక్రమిస్తున్నా.. తెలంగాణ మాత్రం ఎప్పుడూ దాని పరిధిని, పరిమితిని దాటలేదు. ఆర్థిక క్రమశిక్షణలో అగ్రభాగంలో ఉన్న తెలంగాణ తక్కువ అప్పులు తీసుకుంటున్న రాష్ర్టాల్లో ముందువరుసలో నిలిచిందని గతంలోనే కేంద్రం ప్రకటించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో.. దక్షిణాది రాష్ర్టాల్లో తెలంగాణ మాత్రమే అతి తక్కువ రుణాలను తీసుకున్నది.
కార్పొరేట్ సంస్థలపై ప్రేమతోనే..
అప్పు తెచ్చుకొనే పరిమితిని ప్రస్తుతమున్న 3.5 శాతం నుంచి నాలుగు శాతానికి పెంచిన కేంద్రం.. అందులో 0.5 శాతం రుణాలను కచ్చితంగా విద్యుత్తు రంగంలోనే ఖర్చుపెట్టాలనే షరతు విధించడం విస్మయానికి గురిచేస్తున్నది. విద్యుత్తు సవరణ చట్టం వెనుక విద్యుత్తు సంస్థలను కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేయాలన్న దురుద్దేశం ఉన్నందున అనేక రాష్ర్టాలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. తెలంగాణ సైతం బిల్లును మొదటి నుంచి గట్టిగా వ్యతిరేకిస్తూనే ఉన్నది. ఈ నేపథ్యంలో.. అప్పు తెచ్చుకొనేందుకు కేంద్రం కల్పించిన 0.5శాతం వెసులుబాటును తెలంగాణ వినియోగంచుకొనే అవకాశం లేదు. కేంద్రం రుణ పరిమితిని పెంచినట్టే పెంచి లాగేసుకున్నదని ఆర్థికశాఖ నిపుణులు అంటున్నారు.
2020-21 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర జీఎస్డీపీ రూ. 9.80 లక్షల కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో అది మరింతగా పెరిగే అవకాశం ఉన్నది. ఈ లెక్కన..కేంద్రం కల్పించిన 0.5శాతం రుణ వసతి ప్రకారం అదనంగా మరో రూ.5వేల కోట్లు అప్పు తెచ్చుకొనే వెసులుబాటు రాష్ర్టానికి లభిస్తుంది. కానీ కేంద్రం విధించిన షరతు కారణంగా ఆ మొత్తాన్ని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకొనే అవకాశం లేనట్టే.