హైదరాబాద్ : రవాణా శాఖకు అదనపు ఆదాయం వచ్చేలా వినూత్న మార్గాలను అన్వేషించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ( Mallu Bhatti Vikramarka ) అధికారులను ఆదేశించారు. ప్రీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం రవాణా, బీసీ సంక్షేమ శాఖల పద్దులపై సచివాయంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) తో కలిసి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) పై ప్రజల్లో అంచనాలు ఎక్కువగా ఉన్నాయని, మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలన్నింటినీ నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ‘మహాలక్ష్మి’ పథకంతో ప్రభుత్వం ఆర్టీసీని ఆర్థికంగా ఆదుకుంటున్నదని చెప్పారు. రవాణా శాఖ పనితీరు ఇంకా మెరుగుపడాలని, అంతర్గత ఆదాయ వనరులు పెంచుకునే మార్గాలను అన్వేషించాలని సూచించారు. కార్పొరేషన్ నష్టాలను తగ్గించేందుకు ఆర్టీసీ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఖర్చులను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని, మెట్రోరైలు తరహలో ఆదాయం వచ్చే మార్గాలను అన్వేషించాలని కోరారు. పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేశారు.
మహాలక్ష్మి పథకం వల్ల కొత్త బస్సుల కొనుగోళ్లు
మహాలక్ష్మి పథకం (Mahalaxmi Scheme) వల్ల కొత్త బస్సులు కొనుగోలు చేయల్సిన అవసరం ఏర్పడిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆర్టీసీలో నియామకాలు చేపట్టాలన్న డిమాండ్ కూడా ఉన్నదన్నారు. వెనుకబడిన తరగతుల వారి కోసం ప్రతి జిల్లాలో స్టడీ సర్కిళ్లను ( Study Cirlces) ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బీసీ గురుకులాలకు సొంత భవనాలు ఏర్పాటుచేయాలని, ఓవర్సిస్ సాలర్ షిప్‌ల సంఖ్య పెంచాలని డిప్యూటీ సీఎంను కోరారు.