బెల్లంపల్లి : బీడీ ఆకుల(beedi leafs) సేకరణలో కట్టకు రూ. 2.05 పైసల నుంచి రూ. 3 కు పెంచామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి(Minister Indrakaranreddy) వెల్లడించారు. ఈ సీజన్ నుంచే పెరిగిన రేట్లు వర్తింపజేస్తున్నామని ఆయన అన్నారు. మంచిర్యాల(Manchirial District) జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండల కేంద్రంలో తునికాకు సేకరణదారులకు గురువారం బోనస్ చెక్కుల(Bonus Checks)ను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏజెన్సీలో ఆదివాసీలకు తునికాకు సేకరణ రెండో పంటగా, ఆర్థిక వనరుగా ఉపయోగపడుతుందని అన్నారు. తునికాకు సేకరణ ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో కూలీలకు బోనస్ రూపంలో రెవెన్యూ నెట్ షేర్ ను చెల్లిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2016 నుంచి 2021 వరకు రూ.200 కోట్లను బోనస్ చెల్లిస్తున్నామని వివరించారు.
సీఎం కేసీఆర్(CM KCR ) ఆదేశాల మేరకు సిర్పూర్ నియోజకవర్గం నుంచి తునికాకు కూలీలకు బోనస్ ను చెల్లించే ప్రక్రియను ప్రారంభించామన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో రూ.10. 45 కోట్లను లబ్ధిదారులకు నేరుగా వారి ఖాతాల్లోనే నగదు జమ అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, పీసీసీఎఫ్ (HoFF) ఆర్.డొబ్రియల్, డి.ఎఫ్.వో ఆశిష్ సింగ్ పాల్గొన్నారు.