హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో హైడ్రా ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. బుల్డోజర్ల భయానికి రెండు నెలలుగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం చిగురుటాకులా వణుకుతున్నది. కూల్చివేతల కారణంగా ఇండ్లు, ఫ్లాట్ల కొనుగోళ్లు తగ్గుముఖం పట్టగా.. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ టెన్షన్‌తో ప్లాట్ల కొనుగోళ్లు అమాంతం పడిపోయాయి. ఫలితంగా రాష్ట్రంలో గత రెండు నెలలుగా వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. రాష్ట్ర ఖజానాపై ‘హైడ్రా’ ఓ బాంబులా పరిణమించిందని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో హైడ్రా హడావుడి మొదలైన ఆగస్టు నుంచి క్రమంగా రిజిస్ట్రేషన్ల సంఖ్య సగటున 20 శాతం, ఆదాయం సగటున 30 శాతం పడిపోయిందని చెప్తున్నారు.
రెండు నెలలుగా పడిపోయిన ఆదాయం
రాష్ట్రంలో ఆగస్టు రెండో వారం నుంచి వ్యవసాయ, వ్యవసాయేతర భూముల లావాదేవీల్లో తిరోగమనం నెలకొన్నది. గణాంకాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టంచేస్తున్నాయి. జూలైతో పోల్చితే ఆగస్టు, సెప్టెంబర్‌లో వరుసగా రిజిస్ట్రేషన్లు తగ్గడంతోపాటు ఖజానాకు గండి పడుతున్నది.
ఈ ఏడాది జూలైతో పోల్చితే ఆగస్టులో రిజిస్ట్రేషన్లు 27.39 శాతం తగ్గగా, ఆదాయం ఏకంగా 30 శాతం పడిపోయింది. సెప్టెంబర్ పరిస్థితి మరింత దిగజారింది. రిజిస్ట్రేషన్లు 13 శాతం తగ్గగా.. ఖజానాకు రాబడి 28 శాతం తగ్గింది.
హైడ్రా రాకముందు, వచ్చిన రెండు నెలల తర్వాత గణాంకాలే మార్పును స్పష్టం చేస్తున్నాయి. జూలైలో రూ.1,531 కోట్ల ఆదాయం రాగా, సెప్టెంబర్ నాటికి ఏకంగా సగానికి పడిపోయింది. కేవలం రూ.770 కోట్ల ఆదాయమే వచ్చింది. రిజిస్ట్రేషన్లు జూలైలో 2.04 లక్షలు కాగా, సెప్టెంబర్ నాటికి 36 శాతం తగ్గాయి.
ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ఫోబియా
ప్రస్తుతం రాష్ట్రంలో ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ఫోబియా పట్టుకున్నదని రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాపోతున్నారు. ఒకప్పుడు కొనుగోలుదారులు వెంచర్లకు, అపార్ట్మెంట్లకు, ఇండ్లకు అన్ని ప్రభుత్వ శాఖల అనుమతులు ఉంటే నమ్మకంగా రిజిస్ట్రేషన్ చేయించుకునేవారని చెప్తున్నారు. కానీ, ఇప్పుడు ఏ ఇల్లు, ఫ్లాట్, స్థలానికి సంబంధించి అన్ని అనుమతి పత్రాలు చూపినా నమ్మడం లేదని అంటున్నారు. చెరువుకు ఎంత దూరంలో ఉన్నది? ఎఫ్టీఎల్ పరిధి ఎంత వరకు? బఫర్ జోన్ కిందికి వస్తుందా? హైడ్రా కూల్చేస్తుందా? అంటూ ఒకటికి వందసార్లు చెక్ చేసుకుంటున్నారని చెప్తున్నారు. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో ఆస్తులు కొనుగోలు చేసేవారిలో ఈ భయాలు ఎక్కుగా ఉన్నాయని తెలిపారు. వాస్తవానికి హైడ్రా ఔటర్ రింగ్‌రోడ్ వరకు మాత్రమే పరిమితమని ప్రభుత్వం చెప్తున్నది.
10