హైదరాబాద్: విపత్తు నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబర్చినందుకుగాను హైదరాబాద్లోని ఇన్కాయిస్కు జాతీయ పురస్కారం లభించింది. 2025కుగాను ఇన్స్టిట్యూషనల్ విభాగంలో ప్రతిష్టాత్మక సుభాష్ చంద్రబోస్ ఆప్ద ప్రబంధన్ అవార్డును ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (INCOIS)కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
విపత్తు నిర్వహణ రంగంలో దేశంలో వ్యక్తులు, సంస్థలు అందించిన అమూల్యమైన సహకారం, నిస్వార్థ సేవలు గుర్తించి గౌరవించేందుకు గాను ప్రధాని మోదీ ప్రభుత్వం సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ పేరుతో ఏటా జాతీయ పురస్కారాలను ప్రదానం చేస్తున్నది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి అయిన జనవరి 23న ప్రతీ సంవత్సరం ఈ అవార్డును ప్రకటిస్తున్నది. ఈ పురస్కారం కింద సంస్థలకు అయితే రూ.51 లక్షలు సర్టిఫికెట్, వ్యక్తులకు రూ.5 లక్షలు, సర్టిఫికేట్ అందజేస్తారు. 2025కు సంబంధించి అవార్డులకు గతేడాది జూలై 1 నుంచి దరఖాస్తులను స్వీకరించారు. మొత్తంగా 297 నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా, 1999లో ఇన్కాయిస్ను హైదరాబాద్లో ఏర్పాటు చేశారు.