హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పాలనలో (Congress Govt) నాణ్యమైన ఆహారం అందక గురుకుల విద్యార్థులు (Gurukula Students) దవాఖానాల పాలవుతున్నారు. ఆహార కలుషితంతో (Food Poison) అనారోగ్యాల పాలవుతున్నారు. రెండేండ్లలో దాదాపు 150గురుకులాల్లో ఫుడ్‌పాయిజన్ కేసులు నమోదు కాగా, 2వేల మందికిపైగా విద్యార్థులు దవాఖానాల పాలయ్యారని గణాంకాలే వెల్లడిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో కామన్ మెనూకు తిలోదకాలివ్వడం, పాత గుత్తేదారులనే కొనసాగించడం మూలంగానే ఈ దుస్థితి నెలకొన్నదని గురుకుల ఉపాధ్యాయులే వివరిస్తున్నారు. ప్రిన్సిపాళ్లు, గుత్తేదారులు కుమ్మక్కై విద్యార్థుల పొట్టగొడుతున్నారని మండిపడుతున్నారు. తాత్కాలికంగా బాధ్యులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటున్నారే తప్ప, ఉన్నతాధికారులు గురుకులాల వైపు కన్నెత్తి చూస్తున్న పరిస్థితి లేదు. ప్రభుత్వం సైతం పట్టనట్టుగానే వ్యవహరిస్తున్నదని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి.
గురుకులాల్లో పదే పదే ఫుడ్‌పాయిజన్ కేసులు నమోదవుతుండటం రేవంత్ సర్కారు వైఫ్యలానికి నిదర్శనంగా నిలుస్తున్నది. వాస్తవంగా గురుకులాల్లో కిరాణాసామగ్రి, పండ్లు, కూరగాయలు, చికెన్, మటన్ సరఫరా, క్యాటరింగ్, స్వీపింగ్ సేవల కోసం ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేసేవారు. మార్చి, ఏప్రిల్ నాటికి టెండర్ల ప్రక్రియను పూర్తి చేయడం పరిపాటి. ఫలితంగా విద్యా సంవత్సరం ఆరంభం నాటికి అన్నివిధాలుగా కొత్త కాంట్రాక్టర్లు సిద్ధంగా ఉండేవారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఇప్పటివరకు కొత్త టెండర్లను ఆహ్వానించలేదు. 2025-26 విద్యాసంవత్సరానికి ఇప్పటివరకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేయలేదు. సుదీర్ఘ జాప్యం తరువాత ప్రభుత్వం సరకుల సేకరణపై ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ (పీఎస్‌యూ)ను ఏర్పాటు చేస్తూ జూలైలో ఆదేశాలు జారీచేసింది. ఆ కమిటీ ఆగస్టులో మార్గదర్శకాలు జారీ చేసి, టెండర్లను పిలవగా.. కేవలం 20% చోట్ల మాత్రమే టెండర్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో తమనే కొనసాగించాలని పలువురు పాత గుత్తేదారులు కోర్టును ఆశ్రయించారు. దీంతో టెండర్ల ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం పాత రేట్లతోనే, పాత గుత్తేదారులతోనే నిర్వహిస్తున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ధరలను సవరించకపోవడంతో గుత్తేదారులు థర్డ్ గ్రేడ్ సరుకులను సరఫరా చేస్తున్న దుస్థితి నెలకొన్నది. గుత్తేదారులతో పలువురు ప్రిన్సిపాళ్లు కుమ్మక్కు అవుతుండటంతోపాటు నాణ్యతకు పూర్తిగా తిలోదకాలు ఇచ్చారు. బిల్లులను కూడా ప్రభుత్వం సకాలంలో చెల్లించపోవడమూ గుత్తేదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి కారణమని తెలుస్తున్నది. విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష బీఆర్ఎస్ ఒత్తిడితో ఎట్టేకేలకు ప్రభుత్వం మెస్ చార్జీలను పెంచుతూ ఆగస్టులో ఉత్తర్వులు జారీ చేసింది. కామన్ డైట్‌ను కూడా అట్టహాసంగా ప్రకటించింది. కానీ నెలలు గడుస్తున్నా.. ఆచరణలోకి రాకపోవడం గమనార్హం.
గతంలో క్యాటరింగ్ సేవలను నిర్వహించిన గుత్తేదారులకు సైతం ప్రభుత్వం 8నెలల బిల్లులు విడుదల చేయలేదు. దీంతో క్యాటరింగ్ నిర్వాహకులు నిర్ణీత సంఖ్యలో మనుషులను నియమించకుండా అరకొరగానే నియమించి కాలం వెల్లదీస్తున్నారు. దీంతో సిబ్బందిపై పనిఒత్తిడి పెరిగి వంటపాత్రలను శుభ్రంగా కడగకపోవడంతోపాటు పరిశుభ్రత పాటించకుండా ఇష్టారీతిన వంట నిర్వహణను మమా అనిపిస్తున్నారు. అంతిమంగా అది ఫుడ్‌పాయిజన్ ఘటనలకు దారితీస్తున్నది. స్వీపింగ్ సంస్థ ప్రతీ గురుకులంలో నలుగురు పారిశుధ్య కార్మికులను ఏర్పాటు చేయాలి. కానీ ప్రభుత్వం ఈ ఏడాది స్వీపింగ్ సిబ్బందిని నియమించలేదు. దీంతో గురుకులాల్లో ఎక్కడికక్కడ అపరిశుభ్ర వాతావరణం నెలకొన్నది. నీటిట్యాంకులను సైతం శుభ్రం చేయని దుస్థితి నెలకొన్నది. వెరసి నీరు కలుషితమై ఎక్కువగా ఫుడ్‌పాయిజన్ కేసులు నమోదయ్యేందుకు కారణమవుతున్నది. మొత్తంగా సర్కారు వైఫల్యమే ఫుడ్‌పాయిజన్ కేసులు పెరిగేందుకు కారణమని విద్యార్థి సంఘాలు, సొసైటీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.