కమలాపూర్, మే 4: కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యుల నిర్లక్ష్యం మహిళ ప్రాణం మీదకు తెచ్చింది. డెలీవరీ కోసం దవాఖానకు వస్తే కడుపులోనే క్లాత్ ఉంచి కుట్లు వేసిన ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో ఆదివారం వెలుగుచూసింది. బాధితుల కథనం ప్రకారం.. ఉప్పల్ గ్రామానికి చెందిన వానరాసి తిరుమల డెలివరీ కోసం కమలాపూర్ 30 పడకల దవాఖానలో 27 ఏప్రిల్ న అడ్మిట్ అయింది. రాత్రి కాన్పు చేసిన వైద్యులు కడుపులోనే క్లాత్ మరిచిపోయి కుట్లు వేశారు. దవాఖాన నుంచి మూడు రోజులకు తలి,్ల బిడ్డ డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లారు.
తిరుమలకు కడుపు నొప్పి తీవ్రత పెరగడంతో సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. గమనించిన వైద్య సిబ్బంది (ఏఎన్ఎం) కుట్లు రెండు పగిలిపోవడంతో కడుపులో నుంచి క్లాత్‌ను బయటకు తీసినట్టు బాధితులు తెలిపారు. పెద్దాసుపత్రి అని వస్తే డాక్టర్లు నిర్లక్ష్యంగా ఆపరేషన్ చేసి కడుపులో క్లాత్ ఉంచారని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. డెలివరీ కోసం దవాఖానకు వస్తే నిర్లక్ష్యంగా ఆపరేషన్ చేస్తారా? అని నిలదీయగా.. ఏం చేసుకుంటారో చేసుకోండి అని సిబ్బంది బెదిరించినట్టు బాధితులు తెలిపారు. దురుసుగా ప్రవర్తిస్తున్న సిబ్బందిపై పీఏసీఎస్ డైరెక్టర్ మౌటం రమేశ్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు చేరుకుని బాధితులను సముదాయించారు. రోగికి వైద్యం అందిస్తున్నారు. డాక్టర్ భానుప్రసాద్‌ను వివరణ కోరగా డెలివరీ చేసి బ్లీడింగ్ కాకుండాగైనకాలజిస్ట్ క్లాత్ పెట్టినట్టు వివరించారు.