సీరోలు(కురవి), జూన్ 16 : బిల్లు రాకపోవడంతో ఆగ్రహించిన కాంట్రాక్టర్ బడికి తాళం వేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం కాంపల్లి శివారు బీల్యానాయక్‌తండాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా బీల్యానాయక్ తండాలోని పాఠశాల అభివృద్ధి పనులకు రూ.17.75 లక్షలు మంజూరయ్యాయి. దీంతో కాంట్రాక్టర్ బానోత్ శ్రీనివాస్ పాఠశాలకు మరమ్మతులు చేశారు.
వీటిలో ఇప్పటి వరకు రూ.6 లక్షలు మాత్రమే సర్కార్ చెల్లించింది. మిగిలిన డబ్బులు నేటికీ రాకపోవడంతో విసిగిపోయిన శ్రీనివాస్ మంగళవారం పాఠశాలకు తాళం వేశారు. హెచ్ఎం వీరన్న పాఠశాలకు తాళం వేసి ఉండటంతో కాంట్రాక్టర్‌తో మాట్లాడారు. అయినా అతడు తాళం తీయకపోవడంతో విద్యార్థులు వరండాలోనే కూర్చోగా ఉపాధ్యాయులు పాఠాలు బోధించారు. హెచ్ఎం వీరన్న ఎంఈవో లచ్చీరాం నాయక్ దృష్టికి తీసుకెళ్లగా బీఆర్ఎస్ నాయకులు బానోత్ నెహ్రూ, హుస్సేన్ సహకారంతో కాంట్రాక్టర్‌ను పాఠశాలకు పిలిపించి తాళం తీయించారు.