సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 23 : ‘అమ్మా.. నేనేం పాపం చేసిన. ఆడబిడ్డగా పుట్టడమే నేను చేసిన నేరమా?. ఎందుకు నన్నిలా మరుగుతొట్టిలో వేశావ్.. ఈ కంపు నేను భరించలేక పోతున్నానమ్మా..?’ అనేలా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్లో గల మూత్రశాలలో ఓ శిశువు ఏడుపు విన్న ప్రతి ఒక్కరి గుండె తరుక్కుపోతున్నది.
గురువా రం సాయంత్రం అటుగా వెళ్తున్న ఓ మహిళకు చంటిపాప ఏడుపు వినిపించగా, వెంటనే లోపలికి వెళ్లి ఆడశిశువును చూసి స్థానికుల సహకారంతో పోలీసులకు సమాచారం అందించింది. అక్కడికి చేరుకున్న పోలీసులు, జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారులు శిశువును స్థానిక ప్రభుత్వ దవాఖానకు తరలించగా.. వైద్యసేవలు అందిస్తున్నారు.