కాటారం, అక్టోబర్ 21 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని దామెరకుంట ఎస్సీ బాలికల గురుకులంలో దారుణం చోటుచేసుకున్నది. నిద్రిస్తున్న ముగ్గురు విద్యార్థినుల గొంతులపై అర్ధరాత్రి సమయంలో కోసినట్టుగా గాట్లుపడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై సోమవారం ఓ బాలిక తండ్రి కాటారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
గురుకులంలో ఐదు రోజుల క్రితం ఆరోతరగతి విద్యార్థినులు రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్రపోయారు. ఉదయం లేచి చూసే సరికి ముగ్గురు విద్యార్థినులకు గొంతు, చెవిపై గాయాలతోపాటు రక్తం కనిపించడంతో హౌస్ మేడం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రిన్సిపాల్ ఆదేశాలతో వారిని కాటారం పీహెచ్సీకి తీసుకొచ్చి వైద్యం చేయించారు. ఈ క్రమంలో దీపావళి పండుగ కోసమని విద్యార్థినులను ఇంటికి తీసుకెళ్లడానికి తల్లిదండ్రులు ఆదివారం సాయంత్రం గురుకులానికి వచ్చారు.
తమ గొంతుపై అయిన గాయాలను చూపుతూ విద్యార్థినులు కన్నీరు పెట్టుకున్నారు. దీనిపై ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులతో తల్లిదండ్రులు వాదనకు దిగారు. అనంతరం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ట్రీట్మెంట్ చేయించగా బాగానే ఉన్నారని, రాత్రి ఏం జరిగిందో తమకు తెలియదని ప్రిన్సిపాల్ వెంకటలక్ష్మి తెలిపారు. చిన్న గాయాలే కావడంతో తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నారు. ఎస్సై శ్రీనివాస్ గురుకులాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. బుధవారం డీసీవోతోపాటు పోలీస్ అధికారులు గురుకులానికి వచ్చి ఆరా తీయనున్నట్టు సమాచారం. ఈ ఘటనతో విద్యార్థినులు, తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.