మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Nov 14, 2020 , 02:59:23

సంక్షోభంలోనూ సంక్షేమం

సంక్షోభంలోనూ సంక్షేమం

  • సీఎం సంకల్ప బలంతోనే అభివృద్ధి పథంలో రాష్ట్రం
  • శాంతిభద్రతలతో ప్రశాంత వాతావరణం
  • గుడుంబా కంపునుంచి రాజధానికి విముక్తి
  • పేదింట్లో పెండ్లిబాజాలకు మల్టీపర్పస్‌ హాళ్లు
  • పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు
  • నగరంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కొవిడ్‌-19, వర్షాలు, వరదలు వంటి విపత్తులు ఎదురైనా సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూనే ఉన్నామని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారిని అన్నివేళలా ఆదుకుంటున్నామని చెప్పారు. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తూనే ఉన్నారని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌ పరిధిలోని సనత్‌నగర్‌, కంటోన్మెంట్‌ నియోజకవర్గాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి కేటీఆర్‌ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లు, వైకుంఠధామం, లైబ్రరీ, పేదల కోసం ఫంక్షన్‌హాళ్లను ప్రారంభించారు. సనత్‌నగర్‌ స్పోర్ట్స్‌కాంప్లెక్స్‌, మారేడ్‌పల్లిలోని మల్టీపర్పస్‌ ఫంక్షన్‌హాల్‌లో మంత్రి తలసాని అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశాల్లో కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలోనూ జరుగని అభివృద్ధినిగత ఆరేండ్లలో తెలంగాణ ప్రభుత్వం చేసి చూపిందని.. దేశం యావత్తు రాష్ట్రంవైపు చూసేలా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్‌ సంకల్పబలంతోనే రాష్ట్రం అభివృద్ధిపథంలో దూసుకుపోతున్నదని చెప్పారు. ప్రజాసంక్షేమం కోసం అనేక సంస్కరణలు, నూతన చట్టాలను తీసుకొస్తున్నారని తెలిపారు. రాజధాని నగరంలో ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు అనేక కార్యక్రమాలు  చేపట్టారని గుర్తుచేశారు. రాష్ట్రంలో డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు నిర్మించామని, మరికొన్నిచోట్ల నిర్మాణాలు చివరి దశకు వచ్చాయని.. వాటిని పూర్తిచేసి మధ్యతరగతి, పేదలకు అందజేస్తామని చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో నగరంలో ఎప్పుడూ అల్లకల్లోల పరిస్థితులు     ఉండేవని.. తెలంగాణ ప్రభుత్వం శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవ    హరిస్తూ వాటిని రూపుమాపిందని అన్నారు. హైదరాబాద్‌లో గుడుంబా కంపు అనేది లేకుండా వాటి తయారీస్థావరాలపై ఉక్కుపాదం మోపామని తెలిపారు. పెండ్లిండ్ల కోసం లక్షల రూపాయలు వెచ్చించలేని పేదలను దృష్టిలో ఉంచుకొని మల్టీపర్పస్‌ ఫంక్షన్‌హాళ్లను నిర్మిస్తున్నామని చెప్పారు. మంచి పనులు చేస్తున్న ప్రభుత్వాలకు ప్రజలు అండగా నిలవాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే సాయన్న, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అయాచితం శ్రీధర్‌, మున్సిపల్‌ పరిపాలనశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అరవింద్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.