నందిగామ, ఫిబ్రవరి 26: నేటి ఉరుకులు పరుగుల జీవితంలో మనుషులకు ప్రశాంతత కరువై మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నారు. ధ్యానం చేయడం ద్వారా ప్రశాంతత లభిస్తుందని, ప్రతి వ్యక్తి జీవితంలో ధ్యానాన్ని భాగంగా చేసుకోవాలని సూచించారు.
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ శాంతివనంలో హార్ట్ఫుల్నెస్ మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్, ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా, పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ సంయుక్త సహకారంతో ఏర్పాటు చేసిన హార్ట్ఫుల్నెస్ అంతర్జాతీయ స్పోర్ట్ సెంటర్‌ను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, శ్రీరామచంద్ర మిషన్ గురూజీ కమలేశ్ పటేల్, బాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్‌లతో కలిసి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆదివారం ప్రారంభించారు. అంతకుముందు గ్రీన్ కన్హ రన్లో భాగంగా కన్హలో ఏర్పాటు చేసిన 2కే, 5కే, 10కే, 21కే రన్ పోటీలను ప్రారంభించారు.