Nagarjuna sagar Dam | హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ నాగార్జునసాగర్ డ్యామ్‌ను స్వాధీనం చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యత్నించడాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఏపీది దుస్సాహసమైన చర్య అని మండిపడింది. గతంలోనూ ఇదే రీతిలో వ్యవహరించిందని ధ్వజమెత్తింది. అర్ధరాత్రి 100 మంది సాయుధ పోలీసులను దింపి డ్యామ్‌పై ముళ్ల కంచె ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. డ్యామ్ కంట్రోల్‌ను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేఆర్ఎంబీ చైర్మన్, మెంబర్ సెక్రటరీకి ఫిర్యాదు చేసింది.
2014 నుంచి శ్రీశైలం డ్యాం ఏపీ ప్రభుత్వం ఆధీనంలో, నాగార్జునసాగర్ తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయని గుర్తుచేసింది. రెండు జలాశయాల్లో నీటి పంపిణీని కేఆర్ఎంబీ పర్యవేక్షిస్తున్నదని, రెండు జలాశయాల నిర్వహణ బాధ్యతలను కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు అప్పగించేందుకు ఇప్పటికే ఇరు రాష్ర్టాలు సూత్రప్రాయంగా అంగీకరించాయని గుర్తుచేసింది. ఇందుకు ఆపరేషన్ ప్రొటోకాల్ రూపొందించే దిశగా చర్చలు కొనసాగుతున్నాయని, అప్పటివరకు ప్రాజెక్టుల నిర్వహణపై యథాతథస్థితిని కొనసాగించాల్సి ఉన్నదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం గతంలో కూడా నాగార్జునసాగర్ డ్యామ్‌ను సైతం ఆక్రమించడానికి యత్నించిందని గుర్తుచేసింది.
తాజాగా తెలంగాణ ఎన్నికల్లో నిమగ్నమై ఉండగా, ఇదే అదునుగా బుధవారం అర్ధరాత్రి 100 మంది సాయుధ పోలీసులను దింపి డ్యామ్‌ను అక్రమించేందుకు యత్నించిందని, 13వ గేట్ వద్ద ముళ్ల కంచెను ఏర్పాటు చేసిందని, అక్కడ ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేసిందని తెలిపింది. ఇది అప్రజాస్వామికమని పేర్కొన్నది. కుడి కాలువ ద్వారా అక్రమంగా నీటిని తరలించుకుపోతున్నదని మండిపడింది. దీనిపై కేఆర్ఎంబీ వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసింది. దౌర్జన్యపూరితంగా ఏపీ చేపట్టిన నీటి తరలింపును ఆపాలని, డ్యామ్ ఆక్రమణను తొలగించి పూర్వపుస్థితిని పునరుద్ధరించి మొత్తం డ్యామ్ కంట్రోల్‌ను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలని విజ్ఞప్తి చేసింది. డ్యాంను కంట్రోల్లోకి తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్‌కు సహకరించడానికి ఈఎన్సీ హరిరాం, చీఫ్ ఇంజినీర్ ధర్మతోపాటు పలువురు సీనియర్ ఇంజినీర్లను డ్యామ్ వద్దకు పంపించింది.