Karnataka | ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ప్రతి లబ్ధిదారుడికి 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. గంపగుత్తగా ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చింది. కోట్లమందికి పంచటానికి ఎంత మొత్తం బియ్యం అవసరం? రాష్ట్రంలో ఉత్పత్తి ఎంత ఉన్నది? నెలనెలా అయ్యే ఖర్చు ఎంత? అన్న ఆలోచన లేకుండా హామీలైతే గుప్పించింది. తీరా అధికారంలోకి వచ్చి ఆ హామీని అమలు చేసే సమయం వచ్చాక చేతులు పిసుక్కొంటున్నది. బియ్యం దొరకటంలేదు.. కేంద్రం ఇవ్వటం లేదని సన్నాయి నొక్కులు నొక్కుతూ హామీని గంగలో కలిపేసింది.
దేశంలో నాలుగేండ్లకు సరిపడా బియ్యం నిల్వలు ఉన్నాయని మొన్ననే చెప్పిన కేంద్రం.. ఆరు నెలల్లోనే మాటమార్చి దేశంలో బియ్యం కొరత తీవ్రంగా ఉన్నదని చెప్తున్నది. మా దగ్గర పుట్లకొద్దీ వడ్లు ఉన్నాయి కొనుగోలు చేయండి అని తెలంగాణ ప్రభుత్వం ఎన్నిసార్లు అడిగినా.. మాకొద్దుపో అన్న కేంద్రం, ఇప్పుడు రాష్ర్టాలకు ఇస్తే.. మాకు బియ్యం ఉండొద్దా? అసలే కటకట ఉన్నది అని అంటున్నది.
బెంగళూరు, జూన్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ కొట్లాట పేదల నోటికాడి కూడును మట్టిపాలు చేసింది. ముందుచూపు లేని నిర్ణయాలు, తాత్కాలిక ప్రయోజనం కోసం గుప్పించిన హామీలు చివరకు ప్రజల ఆశలను ఛిద్రం చేశాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు దండుకొనేందుకు కాంగ్రెస్ ఇచ్చిన ఉచిత బియ్యం పంపిణీ హామీ అమలు సాధ్యం కాదని సిద్ధరామయ్య ప్రభుత్వం చావు కబురు చల్లగా చెప్పింది. కేంద్ర ప్రభుత్వం బియ్యం ఇవ్వటంలేదని, అందుకే ఆ పథకాన్ని అమలుచేయలేమని తెలిపింది. బియ్యానికి బదులుగా డబ్బు ఇస్తామని చెప్తున్నది. కర్ణాటకకు బియ్యం ఇవ్వకుండా పగబట్టినట్టు వ్యవహరించిన బీజేపీ.. ఇప్పుడు శుద్ధపూసలాగా రూ.170తో 5 కిలోల బియ్యం వస్తాయా? అని ప్రశ్నిస్తున్నది. రాష్ట్రంలో ‘నువ్వు కొట్టినట్టు చెయ్యి.. నేడు ఏడ్చినట్టు చేస్తా’ అన్నట్టుగా బీజేపీ, కాంగ్రెస్ తీరు ఉన్నదని ప్రజలు మండిపడుతున్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తమకు ఓట్లేసి గెలిపిస్తే ‘అన్నభాగ్య పథకం’ పేరుతో అర్హులైన ప్రతి వ్యక్తికి నెలనెలా రూ. 5 కిలోల బియ్యం పంపిణీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ పథకాన్ని అమలుచేసేందుకు సిద్ధరామయ్య ప్రభుత్వం కిందామీదా పడుతున్నది. ఈ పథకం కోసం బియ్యం ఇవ్వండి.. మార్కెట్ ధరకే కొంటామని కేంద్రాన్ని కోరింది. తమను ఓడించారన్న అక్కసుతో రగిలిపోతున్న బీజేపీ.. ప్రజలపై పగ తీర్చుకొనేందుకు ఇదే సరైన అవకాశం అనుకొన్నట్టున్నది. రాష్ట్రప్రభుత్వం ఎన్నిసార్లు అడిగినా గింజ కూడా ఇచ్చేది లేదని తెగేసి చెప్పింది. దీంతో పరువు పోతుందని భయపడిన కాంగ్రెస్ ప్రభుత్వం.. బియ్యానికి బదులుగా డబ్బులు ఇస్తామని చెప్తున్నది. ఎఫ్సీఐ కిలో రూ.34 చొప్పున అమ్ముతున్నదని.. ఆ లెక్కన 5 కిలోల బియ్యానికి రూ.170 నేరుగా లబ్ధిదారులకు ఇస్తామని ప్రకటించింది. ఇంత రాద్ధాంతానికి కారణం కాంగ్రెస్ అనాలోచిత హామీలేనని విశ్లేషకులు మండిపడుతున్నారు.
కేంద్రంలోని బీజేపీకి ఇప్పటికీ దేశ ప్రజల ఆహార అవసరాలపై ఓ ప్రణాళిక అంటూ లేదు. అందుకు ఉదాహరణ తెలంగాణ నుంచి బియ్యం కొనుగోలుకు నిరాకరించటమే. బియ్యం సేకరించాలని కేంద్రాన్ని కోరితే.. గింజ కూడా కొనేది లేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెగేసి చెప్పారు. కానీ, ఆరేడు నెలలు గడువక ముందే సదరు మంత్రి నాలుక మడతేశారు. కేంద్ర పూల్లో బియ్యం, గోధుమ నిల్వలు చాలా తక్కువ ఉన్నాయని, మీకు అవసరమైతే బహిరంగ మార్కెట్లో కొనుక్కోండని అని వారం క్రితం రాష్ర్టాలకు ఉచిత సలహా ఇచ్చారు. నాలుగేండ్లకు సరిపడా నిల్వలు ఉన్నప్పుడు.. ఇంతలోనే కొరత ఎలా వచ్చింది? నాడు తెలంగాణకు చెప్పిన మాట అబద్ధమా? అని మేధావులు మండిపడుతున్నారు.