యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉప ఎన్నికలో కోమటిరెడ్డి బ్రదర్స్ నీతిమాలిన చర్యలు ఆగడంలేదు. పార్టీలు, గుర్తులతో సంబంధం లేకుండా ఓటర్లకు రోత పుట్టించే పనులను నిర్విరామంగా చేస్తున్నారు. ఉపఎన్నిక ప్రచారంలో బీజేపీ నుంచి పోటీచేస్తున్న రాజగోపాల్‌రెడ్డికి అనుకూలంగా ఇతర నియోజకర్గాలకు చెందిన కాంగ్రెస్ నేతలతో ప్రచారం చేయిస్తున్నారు. బీజేపీలో చేరకుండా, కాంగ్రెస్‌కు రాజీనామా చేయకుండా ఇంటింటికీ తిరుగుతూ ఓటు అభ్యర్థిస్తున్నారు. రాజగోపాల్‌రెడ్డిని గెలిపించాలని కోరుతున్నారు. బీజేపీకి ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు కోమటిరెడ్డి బ్రదర్స్ అండగా ఉంటూ అవసరాలన్నీ తీరుస్తున్నారు. కాంగ్రెస్ శ్రేణులతో ఫోన్లో మాట్లాడితే రికార్డ్ చేసి ట్రోల్ చేస్తుండటంతో.. ప్రచారానికి వెళ్లిన నేతల ఫోన్ల నుంచి వెంకట్‌రెడ్డితో మాట్లాడిస్తున్నారు. ఏం కావాలంటే అది చేస్తామని ప్రలోభాలకు గురిచేస్తున్నారు.
ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ప్రచారం లో దూసుకెళ్లడంతో బీజేపీ శ్రేణుల్లో గుబు లు పట్టుకున్నది. మూడోస్థానానికి పరిమితమవుతామనే భయంతో కోమటిరెడ్డి బ్రదర్స్ అడ్డదారులు తొక్కుతున్నారు. ఇతర నియోజకవర్గాల్లో ఉన్న తమ అనుచరుల ద్వారా రాజగోపాల్ కోసం క్యాంపెయిన్ చేయిస్తున్నారు. నల్లగొండ, భువనగిరి, నకిరేకల్, ఆలేరు, దేవరకొండ నియోజకవర్గాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు రాజగోపాల్ తరఫున ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అయితే వీళ్లు కాంగ్రెస్‌కు రాజీనామా చేయలేదు. బీజేపీలోనూ చేరలేదు. బీజేపీ కండువా కప్పుకోకుం డానే ఆ పార్టీ అభ్యర్థి కోసం పనిచేస్తారు.
మునుగోడులో తమ్ముడి గెలుపు కోసం వెంకటరెడ్డి ఇప్పటికే అన్ని అడ్డదారులను తొక్కారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్ లీడర్లకు ఫోన్లు చేస్తూ రాజగోపాల్ గెలుపునకు కృషి చేయాలని కోరుతున్నారు. దీంతో వెంకటరెడ్డి కాల్స్‌ను కాంగ్రెస్ లీడర్లు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇటీవల ఓ కాంగ్రెస్ నేతకు ఫోన్ చేయగా రచ్చఅయ్యింది. శుక్రవారం సైతం ఓ ఆడియో కలకలం రేపింది. దీంతో వెంకట్‌రెడ్డి తన ప్లాన్ మార్చారు. బీజేపీ తరఫున ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నేతల ఫోన్ల నుంచి ఓటర్లతో మాట్లాడుతున్నట్టు తెలుస్తున్నది.
ప్రచారంలో కాంగ్రెస్ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఇప్పటికే రాజగోపాల్‌రెడ్డి మీకు సాయం చేశారని, ఇంకా ఏంకావాలో చెప్పండి? అని కొందరిని అడుగుతున్నారు. న్యూట్రల్ ఓటర్లను సైతం మభ్యపెడుతున్నారు. స్మార్ట్ ఫోన్లు, ఫ్రిడ్జ్‌లు, టీవీలు, వాషింగ్మెషిన్లు, ల్యాప్‌ట్యాప్‌లు, నగదును ఆఫర్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఉన్న మునుగోడు ఓటర్లను కలుస్తూ ప్రలోభ పెడుతున్నట్టు తెలుస్తున్నది.కాంగ్రెస్‌లో ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నిస్సిగ్గుగా బీజేపీకి ప్రచారం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇంతకుమందు కాంగ్రెస్‌లో ఉన్నోళ్లు, రాజగోపాల్‌రెడ్డి సాయం పొందినోళ్లు, న్యూట్రల్‌గా ఉన్నోళ్లను ముందుగానే గుర్తించి జాబితా తయారు చేసుకొంటున్నారు. ఆ జాబితా ప్రకారం గ్రామాల్లో ప్రచారానికి వెళ్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి ఉదయం 10 వరకు, సాయంత్రం ఆరు నుంచి రాత్రి 8 గంటల వరకు ఇంటింటికీ వెళ్లి కమలం గుర్తుకు ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి ఎంతో చేశారని, ఏదో చేస్తారని మభ్యపెడుతున్నారు.