హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీలో చేరికల పరంపర కొనసాగుతూనే ఉన్నది. మహారాష్ట్ర నుంచి వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమక్షంలో పార్టీలో చేరారు. కేసీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నాదేండ్ బీఆర్ఎస్ ఇన్చార్జి, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో వీరంతా పార్టీలో చేరారు. తెలంగాణ మాడల్ అభివృద్ధిని దేశవ్యాప్తంగా విస్తరించాలని, దేశంలో కిసాన్ సరార్ ఏర్పాటు కోసం అధినేత కేసీఆర్ ఆదేశానుసారం పార్టీ బలోపేతం కోసం పనిచేస్తామని, అందుకు తమ రాష్ట్రంలో తమ వంతుగా కృషిచేస్తామని వారు వెల్లడించారు.

బీఆర్ఎస్ పార్టీలో చేరినవారిలో మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యే వసంత్‌రావ్ బోండె, కాంగ్రెస్ పార్టీ మాజీ జనరల్ సెక్రటరీ విఠల్‌నాయక్, జడ్పీ సభ్యులు సరిత వరడ్, కిన్వత్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసిన, ఎంఎన్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధన్లాల్ పవన్, నాందేడ్ జడ్పీ మెంబర్ నందతాయ్ పవార్, శిర్షేనా, నాందేడ్ జిల్లా మాజీ అధ్యక్షులు సునీత భబలికన్, ఎన్సీపీ మహిళా ఆఘాడీ జిల్లా మాజీ జనరల్ సెక్రటరీ యశోదతాయి కోలి, పర్హాన్ జనశక్తి పార్టీ తాలూకా మాజీ అధ్యక్షుడు దిలీప్‌నాయక్, లహాన్ జడ్పీ సరిల్ అర్ధాపూర్ అరవింద్ దేశ్‌ముఖ్, పంచాయత్ సమితి సభాపతి, కిన్వట్ ఎమ్మెల్యేగా పోటీచేసిన రాంరెడ్డి రాంకిష్టు, హిందూ యువ పరిషత్ అధ్యక్షుడు రంజిత్ దేశ్‌ముఖ్, బీజేపీ యువ మోర్చా తాలూకా జనరల్ సెక్రటరీ వైభవ్ కాలే, హాలేగావ్ మాజీ సర్పంచ్ గజానన్ ధుమలే, లహన్ పంచాయత్ సమితి- శిర్సేనా అధ్యక్షుడు బాబూరావ్ కోర్బన్వాడ్, కాంగ్రెస్‌కు చెందిన నాందేడ్ మాజీ కార్పొరేటర్ మహ్మద్ ఫరాక్, ఏబీవీపీ సహాయ్ సంయోజక్ కృష్ణ ఇంగిల్, ప్రెసిడెంట్ జాషశ్రీ ఇల్లెందుల, వంచిత్ బహుజన్ పార్టీ, కార్యదర్శి రాజేశ్ సోలంకి, నాందేడ్ డిస్ట్రిక్ట్ బార్ అసోసియేషన్ సభ్యులు గణేశ్ జాదవ్ (అడ్వకేట్), పిర్ భూషణ్ వార్డు ప్రెసిడెంట్ సలీం సయ్యద్, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మహ్మద్ షోయబ్ ఉన్నారు. కాగా, లింబ్‌గావ్ నాందేడ్ నార్త్ జడ్పీ నియోజకవర్గం నుంచి సాహెబ్రావు ధనగే, కురుల కాంధార్ జడ్పీ నియోజకవర్గం నుంచి బాలాసాహెబ్ గమారే, కిన్వత్ నియోజకవర్గం మాజీ వైస్ చైర్మన్లు, జడ్పీ నాందేడ్ సమాధాన్ జాదవ్, ప్రకాశ్ గబ్బా తదితరులు త్వరలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.

మహారాష్ట్రకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతలు గురువారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మహారాష్ట్రలో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్టు నేతలు తెలిపారు. త్వరలో ప్రచారం మొదలవుతుందన్నారు. రైతులకు జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించినట్టు చెప్పారు. బీఆర్ఎస్ జాతీయ కార్యవర్గం మహారాష్ట్ర పార్టీ కమిటీల్లో వివిధ పదవుల్లో నియమించినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. అధినేత ఆదేశానుసారంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, ప్రజల్లోకి పార్టీ విధానాలను తీసుకెళ్లేందుకు తమ బాధ్యతలను నిర్వర్తిస్తామని వెల్లడించారు.
అబ్ కి బార్ కిసాన్ సరార్ అనే నినాదంతో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మహారాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లోకి పార్టీని చేరువ చేస్తామని తెలిపారు. సీఎంను కలిసినవారిలో బీఆర్ఎస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాంశు తివారీ, నాసిక్ డివిజన్ కోఆర్డినేటర్ దశరథ్ సావంత్, పూణె డివిజన్ కోఆర్డినేటర్ బాలా సాహెబ్ జయరాం దేశ్‌ముఖ్, ముంబై డివిజన్ కోఆర్డినేటర్ విజయ తానాజీ మోహితే, ఔరంగాబాద్ డివిజన్ సోమనాథ్ థోరట్, నాగ్‌పూర్ డివిజన్ ధ్యానేశ్ వకూడర్, అమరావతి డివిజన్ నిఖిలేశ్ దేశ్‌ముఖ్ తదితరులు ఉన్నారు.