హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): అమ్రాబాద్ పులుల అభయారణ్యం నుంచి గ్రామాల తరలింపు ప్రక్రియ కీలకదశకు చేరింది. అకడి చెంచుల సామాజిక, ఆర్థిక పరిస్థితులపై రెవెన్యూ, అటవీ శాఖలు సర్వే చేపట్టాయి. అందులో భాగంగా అక్కడి కుటుంబాలు, జనాభా, వారి ఇండ్లు, వ్యవసాయ భూములు, గొర్రెలు, పశువులను లెకించారు. తొలిదశలో కొల్లంపెంట, కుడిచింతలబైలు, ఫర్హాబాద్, తాళ్లపల్లి వాసులను, రెండో దశలో వట్వార్పల్లి వాసులను తరలించాలని, అభయారణ్యం నుంచి బయటకు వెళ్లేవారికి రెండు ఆప్షన్లు కింద పరిహారం ఇవ్వాలని అటవీశాఖ ప్రాథమికంగా నిర్ణయించింది.
మొదటి ఆప్షన్లో కుటుంబానికి రూ.15 లక్షల చొప్పున ప్యాకేజీ, రెండో ఆప్షన్లో పునరావాస, పునర్నిర్మాణం కింద భూమికి బదులు భూమి ఇవ్వడంతోపాటు ఇండ్లు, ఇతర సామాజిక భవనాలతో ఓ కాలనీని నిర్మించి ఇవ్వనున్నారు. వీటిలో ఏ ఆప్షన్ను ఎంచుకోవాలన్నది లబ్ధిదారుల ఐచ్ఛికానికే వదిలేశారు. భూమిలేని వారికి కర్ణాటక తరహాలో పరిహారం అందజేయాలని యోచిస్తున్నారు. దీంతో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ నుంచి తొలి విడతలో 4 గ్రామాల నుంచి 415 కుటుంబాలను తరలించేందుకు అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. ఇందుకు సంబందించిన ప్రతిపాదనను ఇప్పటికే రాష్ట్ర స్థాయి కమిటీ ఆమోదించిందని, త్వరలో దీనిని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) ఆమోదం కోసం పంపిస్తామని అటవీశాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఎన్టీసీఏ ఆమోదం లభించగానే చెంచుపెంటలు, గ్రామాల తరలింపు ప్రక్రియను ప్రారంభించనున్నట్టు తెలిపారు.
ఏటీఆర్లో పెరిగిన పులుల సంఖ్య
2022 లెక్కల ప్రకారం అమ్రాబాద్ టైగర్ రిజర్వులో పెద్ద పులుల సంఖ్య 24కు పెరిగినట్టు స్పష్టమవుతున్నది. వాటితోపాటు చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు, రేసుకుకలు పెద్ద సంఖ్యలో ఉన్నాయని, అవి స్వేచ్ఛగా సంచరించేందుకు వీలుగా సమీప గ్రామాలను ఇతర ప్రాంతాలకు తరలిస్తామని అటవీశాఖ చెప్తున్నది.