కవాడిగూడ, అక్టోబర్ 30: తెలంగాణ ఆవిర్భావం తర్వాతే సీఎం కేసీఆర్ వెనుకబడిన ఎరుకలను గుర్తించి ఆత్మగౌవర భవనం, రూ.3.5 కోట్లు నిధులు కేటాయించారని, రిజర్వేషన్ పెంచారని ఏకలవ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వనం రమేశ్ పేర్కొన్నారు. మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతిస్తున్నట్టు ప్రకటించారు. తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం, తెలంగాణ ఏకలవ్య సంఘం రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో ఆర్థిక,ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావును కలిసి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి మద్దతు తెలుపుతూ లేఖ అందజేసినట్టు చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మునుగోడులో టీఆర్ఎస్ విజయదుందుభి మోగించడం ఖాయమని.. కాంగ్రెస్, బీజేపీలు రెండు,మూడు స్థానాల్లో ఉంటాయన్నారు. కూసుకుంట్ల గెలుపును కాంక్షిస్తూ మునుగోడు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీవైఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, భిక్షం, సతీశ్, శంకర్, నరసింహ, రఘు, వనం అశోక్, శేఖర్, శ్యామల రాజు తదితరులు పాల్గొన్నారు.