మెదక్ : అధికారపార్టీకి చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు కుట్రలు పన్నిన బీజేపీ నాయకుల వ్యవహారాన్ని వ్యతిరేకిస్తూ మెదక్ జిల్లాలో నిరసనలు వెల్లువెత్తాయి. ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పిలుపుమేరకు గురువారం జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తాలో మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోళ్లకు బీజేపీ ప్రభుత్వం తెర తీసిందని విమర్శించారు. ప్రశాంతంగా నడుస్తున్న సర్కారును పడగొట్టాలని కుట్ర చేశారని, అందులో భాగంగానే ఒక్కో ఎమ్మెల్యేను రూ.100 కోట్లతో కొనాలని చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు చంద్రబాబు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనాలని రేవంత్ రెడ్డి ద్వారా కుట్రలు చేసి దొరికిపోయారని, ఇప్పుడు బీజేపి నేతలు అదే చేయబోయి భంగపడ్డారని ఆరోపించారు. అదాని, అంబానీలకు దేశాన్ని తాకట్టుపెట్టగా వచ్చిన సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుగోలుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
దేశంలో ప్రశ్నించే గొంతుకులను అణగదొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి కుట్రలు చేస్తున్నదని, సీఎం కేసీఆర్ ముందు బీజేపీ కుప్పిగంతులు సాగవని హెచ్చరించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ దే అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి గడ్డమీద కృష్ణ గౌడ్,మున్సిపల్ కౌన్సిలర్లు ఆర్ కే శ్రీనివాస్, సమియొద్దీన్ కిషోర్, జయరాజ్,నాయకులు రాగి అశోక్,ప్రభు రెడ్డి, శ్రీధర్ యాదవ్, మధుసూదన్ రావు, దుర్గాప్రసాద్, ప్రవీణ్ గౌడ్, అరవింద్ గౌడ్, మంగ. రమేష్ గౌడ్, మధు,శంకర్, ఆడవయ్య, ఉమర్, జుబేర్,బానీ, మహమ్మద్, నగేష్, బాలరాజు,పెరికె. కిషన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.