ఖమ్మం జనవరి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మంలో బుధవారం చరిత్ర తిరగరాసేలా బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు సభ ఇన్చార్జి, మంత్రి హారీశ్‌రావు పేర్కొన్నారు. ఖమ్మంలోని మంత్రి పువ్వాడ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో సోమవారం సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ, యావత్ దేశం ఖమ్మం సభ వైపు చూస్తున్నదని పేర్కొన్నారు. ఈ వేదికనుంచి సీఎం కేసీఆర్ దేశానికి దిశానిర్దేశం చేస్తారని చెప్పారు.
తెలంగాణలో ఎనిమిదేండ్లుగా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను యావత్ దేశ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 157 మెడికల్ కళాశాలలు మంజూరు చేయగా, తెలంగాణకు ఒక్కటికూడా కేటాయించకుండా వివక్ష చూపుతున్నదని మండిపడ్డారు. అయినా సీఎం కేసీఆర్ జిల్లాకు ఒకటి చొప్పున 33 మెడికల్ కళాశాలలు కేటాయించారని చెప్పారు. విద్య, వైద్యంతోపాటు అనేక రంగాలను అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని తెలిపారు.
తెలంగాణ దేశానికి రోల్ మాడల్‌గా మారిందని చెప్పారు. ఖమ్మం సభకు ప్రజలను సమీకరించాల్సిన బాధ్యత కార్పొరేటర్లు, నాయకులపై ఉందని చెప్పారు. ఖమ్మంలో జరిగిన అభివృద్ధి చూసి తాను ఎంతో నేర్చుకున్నానని, అదే స్ఫూర్తితో సిద్దిపేటను అభివృద్ధి చేసినట్టు చెప్పారు. ఖమ్మం నగర అభివృద్ధికి సుమారు రూ.1,300 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. అనంతరం కార్యకర్తలతో మంత్రి ముఖాముఖి నిర్వహించారు.
సీఎం కేసీఆర్‌కు ఖమ్మం జిల్లా అంటే ప్రత్యేక అభిమానం అని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు. కొత్తగూడెం, ఖమ్మానికి మెడికల్ కళాశాలలు మంజూరు చేశారని, కొత్త కలెక్టరేట్లు నిర్మించారని మీడియాతో తెలిపారు. సమావేశంలో ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు నాగరాజు, ఎమ్మెల్యే రాములునాయక్, డీసీసీబీ చైర్మన్ నాగభూషణం, నగర మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరా, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కృష్ణ చైతన్య, కార్పొరేటర్లు పాల్గొన్నారు.