ములుగు, ఆగస్టు 27 (నమస్తేతెలంగాణ)/యాదగిరిగుట్ట/ములుగురూరల్: కాకతీయుల కళా వైభవమైన యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయ శిల్ప కళకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఫిదా అయ్యారు. జీవకళతో చెక్కి న శిల్పాలను చూసి ముగ్ధులయ్యారు. మంగళవారం ములుగు జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయన రోడ్డు మార్గాన ఉదయం 11 గంటలకు ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకోగా మంత్రి సీతక్క, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, కలెక్టర్ దివాకర, ఎస్పీ శబరీష్ పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన ములుగులోని కలెక్టరేట్ సమావేశ మం దిరానికి చేరుకున్నారు. కొమ్ముకోయ నృత్యాలతో గవర్నర్‌కు స్వాగతం పలికారు. జిష్ణుదేవ్‌వర్మ జిల్లాస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించగా జిల్లాలో జరుగుతున్న ప్రగతిని గవర్నర్‌కు కలెక్టర్‌తో పాటు మంత్రి సీతక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం జిల్లాకు చెందిన రచయితలు, కవులు, కళాకారులు, జాతీయ అంతర్జాతీయ క్రీడా అవార్డు గ్రహీతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో చర్చ గోష్టి నిర్వహిస్తూ మధ్యాహ్న భోజనం చేశారు. అక్కడి నుంచి రామప్ప దేవాలయానికి చేరుకొని రుద్రేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు.
ఆలయ గైడ్ల ద్వారా కాకతీయుల నాటి శిల్ప కళల గురించి తెలుసుకొని గవర్నర్ మంత్రముగ్ధులయ్యారు. రామప్ప దేవాలయ ప్రత్యేకత సంతరించుకున్న నీటిపై తేలే ఇటుకల గురించి ప్రొఫెసర్ పాండురంగారావు గవర్నవర్కు ప్రత్యక్షంగా వివరించారు. ఆ తర్వాత భూపాలపల్లి జిల్లా గణపురం లోని కోటగుళ్లను సందర్శించిన అనంతరం గవర్నర్ గోవిందరావుపేట మండలం బుస్సాపురంలోని లక్నవరం సరస్సును సందర్శించి రాత్రి 2వ ఐలాండ్‌లోని కాటేజీలో గవర్నర్ బస చేశా రు. కాగా.. గవర్నర్ ములుగు జిల్లా పర్యటన ఆంక్షల నడుమ కొనసాగింది. జర్నలిస్టులను అనుమతించలేదు. వ రంగల్ పర్యటనకు ముం దు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వెంకటేశంతో కలిసి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకుని పూజ లు నిర్వహించారు. గవర్నర్‌కు ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, దేవదాయ, ధర్మదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ హనుమంత్ కే జండగే, అనువంశిక ధర్మకర్త బీ నరసింహమూర్తి, ఈవో భాస్కర్‌రావు ఘన స్వాగ తం పలికారు. అనంతరం గవర్నర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ప్రధానార్చక బృందం చతుర్వేద ఆశీర్వచనం చేయగా.. దేవదాయ, ధర్మదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఈవో భాస్కర్‌రావు గవర్నర్‌ను వీఐపీ శాలువాతో సన్మానించారు.
గవర్నర్ పర్యటనలో భాగంగా వెంకటాపూ ర్ మండలం పాలంపేట అటవీ ప్రాంతంలో బందోబస్తు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ గుండ్ల ప్రశాంత్‌ను విషపురుగు కాటేసింది. అస్వస్థతకు గురైన ప్రశాంత్‌ను పోలీసులు ములుగు ప్రభుత్వ దవాఖానకు తరలించారు.