హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ)/బంజారాహిల్స్ : మాతృభాషపై ప్రతి ఒక్కరికీ మమకారం ఉంటుందని, ప్రాంతీయ భాషలను అణిచివేసి ఇతర భాషలను బలవంతంగా రుద్దేప్రయత్నం చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ప్రముఖ సినీనటుడు ప్రకాశ్‌రాజ్ అన్నారు. జూబ్లీహిల్స్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో శుక్రవారం ‘దక్షిణ భారతదేశ భాషలు-గుర్తింపు-రాజకీయాలు’ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా నటుడు ప్రకాశ్‌రాజ్ మాట్లాడుతూ.. దక్షిణాది రాష్ర్టాలకు చెందిన ప్రాంతీయభాషలపైనే ఎక్కువ దాడులు జరుగుతుంటాయని, అందుకే ఇక్కడే భాషాసదస్సులు ఎక్కువగా జరుగుతుంటాయని పేర్కొన్నారు.
భాషతోపాటు సంస్కృతిపై దాడులు జరిగితే సహించేది లేదని స్పష్టంచేశారు. ఉత్తరాదివారికి హిందీ మినహా వేరే భాషలపై పట్టు ఉండదనే కారణంతోనే దక్షణాదిపై హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తుంటారని పేర్కొన్నారు.
జర్నలిస్టు డాక్టర్ కే శ్రీనివాస్, వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, మళయాళ రచయిత్రి డాక్టర్ మీనా కందస్వామి, జిలుకర శ్రీనివాస్, అరవింద్ వారియార్ (మళయాళం), ప్రొఫెసర్ తారకేశ్వర్ (కన్నడ), ప్రొఫెసర్ పార్థసారథి (తమిళం), తెలుగు వర్సిటీ వీసీ నిత్యానందరావు, ఇఫ్లూ వర్సిటీ ప్రొఫెసర్ పార్థసారథి తదితరులు అభిప్రాయాలు వెలిబుచ్చారు.