Power Cuts | హైదరాబాద్, మే 12(నమస్తే తెలంగాణ): గత పదేండ్లపాటు ఏ ఇబ్బందీ లేకుండా సజావుగా నడిచిన పరిశ్రమలకు మళ్లీ పాతరోజులు వచ్చాయని కార్మికుల్లో నైరాశ్యం నెలకొన్నది. గత నాలుగైదు నెలలుగా ఏర్పడిన పరిస్థితులతో తమ ఉద్యోగాలు తలకిందులయ్యాయని వారిలో అసంతృప్తి నెలకొన్నది.
విద్యుత్తు కోతలు, పారిశ్రామికరంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై వారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఫలితంగా లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ఈ ప్రభావం పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సమీప భవిష్యత్తులో చేతినిండా పని దొరుకుతుందా? లేదా? అన్నది కూడా సందేహంగా మారిందని కార్మిక వర్గాలు ఆందోళనలో ఉన్నాయి.
పరిశ్రమల భవిష్యత్తు కూడా అగమ్యగోచరంగా తయారైందని, ఇటువంటి పరిస్థితుల్లో జరుగుతున్న ఎన్నికల్లో ఓటు ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడించేందుకు కార్మికులు సమాయత్తమయ్యారు. గత పదేండ్లలో ఉన్న విధంగానే నిరంతర విద్యుత్తు కొనసాగితేనే తమ బతుకులకు భరోసా లభిస్తుందన్న అభిప్రాయంతో వారు ఉన్నారు. తమ భవిష్యత్తుకు భరోసా ఇచ్చే నేతలనే గెలిపించుకునేందుకు మొగ్గు చూపుతారని కార్మికవర్గాలు చెప్తున్నాయి.
ఆ నాలుగు స్థానాల్లో కార్మికుల ఓట్లే కీలకం
రాష్ట్ర రాజధానికి సమీపాన ఉన్న నాలుగు లోక్‌సభ స్థానాల పరిధిలో కార్మికుల ఓట్లే కీలకం కానున్నాయి. చేవెళ్ల, మల్కాజిగిరి, మెదక్, జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎక్కువగా పరిశ్రమలు కేంద్రీకృతమై ఉన్నాయి. బాలానగర్, జీడిమెట్ల, నాచారం, చర్లపల్లి, మల్లాపూర్, ఉప్పల్, పటాన్చెరు, కాటేదాన్ తదితర ప్రాంతాల్లోని వివిధ పరిశ్రమల్లో పెద్ద సంఖ్యలో కార్మికులు పనిచేస్తున్నారు. సుమారు 10 లక్షల మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారని అంచనా.
తెలంగాణ ఏర్పాటు తర్వాత గడచిన పదేండ్లలో భారీగా పెట్టుబడులు రావడం, 50కి పైగా కొత్త పారిశ్రామిక వాడలు ఏర్పాటయ్యాయి. గత పదేండ్లపాటు విద్యుత్తు కోతలు లేకపోవడం, భారీగా పరిశ్రమల రాకతో కార్మికులకు చేతినిండా పని లభించింది. తెలంగాణ ఏర్పాటుకు పూర్వం వేసవికాలంలో మూడు-నాలుగు నెలలపాటు పవర్ హాలిడేలతో కార్మికులు సొంతూళ్లకు వెళ్లేవారు. ఇళ్లకు వెళ్లని వారికి సైతం చేతినిండా పని లభించక సక్రమంగా వేతనాలు వచ్చేవికావు.
అసెంబ్లీ ఎన్నికల అనంతరం గడచిన నాలుగైదు నెలలుగా మళ్లీ గత పరిస్థితులే పునరావృతమవుతున్నాయి. తరచూ విద్యుత్తు కోతలతో ముఖ్యంగా ప్లాస్టిక్, అల్యూమినియం పరిశ్రమలకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. దీని ప్రభావం కార్మికులపై పడుతున్నది. సోమవారం జరిగే పార్లమెంటు ఎన్నికల పోలింగ్‌కు ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు సమాయత్తమవుతున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి మినహా మిగతా మూడు స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది.
గుర్రుగా ఉన్న కార్మికవర్గాలు
ఈ సారి గత అసెంబ్లీ ఎన్నికల అనంతర పరిణామాలతో ఆ యా ప్రాంతాల కార్మికులు గుర్రుగా ఉన్నారు. గతంలో విజయం సాధించి ఎన్నికలకు ముందు పార్టీలు మారిన అభ్యర్థులపైనా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగైదు నెలలుగా తరచూ సంభవిస్తున్న విద్యుత్తు కోత లు, కొత్త పెట్టుబడులు రాకపోవడంతో కార్మికుల్లో కొంత నైరాశ్యం కనిపిస్తున్నది. దీని ప్రభా వం ముఖ్యంగా ఈ నాలుగు పార్లమెంటు స్థానాలపై పడుతుందనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. సోమవారం పోలింగ్ ఉండటంతో ఆయా పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు ఎటువైపు మొగ్గుతారనే ఆసక్తి నెలకొన్నది.
కార్మికుల ప్రసన్నం కోసం పార్టీల ప్రయాస
చేవెళ్ల, మల్కాజ్గిరి, మెదక్, జహీరాబాద్ నియోజకవర్గాల పరిధిలోని కార్మికులను ప్రసన్నం చేసుకునేందుకు వివిధ రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. పారిశ్రామికవాడల్లో ఎన్నికల కోలాహలం నెలకొన్నది. పోలింగ్ సందర్భంగా సెలవు ప్రకటించడంతో కార్మికులంతా కుటుంబాలతో కలిసి ఓటుహక్కును వినియోగించుకునేందుకు సిద్ధమయ్యారు.