హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): మేడిగడ్డ ప్రాజెక్టులో ఏర్పడిన పగుళ్లకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ప్రభుత్వానికి సూచించారు. హైదరాబాద్ తెలంగాణభవన్‌లో బుధవారం మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్‌రెడ్డి, బీఆర్ఎస్ నేత రాఘవతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మరమ్మతులకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) రిపోర్టు అవసరమే లేదని గుర్తుచేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే నిర్ణయాధికారమని, ప్రభుత్వమే మరమ్మతులు చేయొచ్చని మొదటి నుంచీ తాము చెప్తూనే ఉన్నామని తెలిపారు. ఇప్పుడు కాళేశ్వరంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునరుద్ధరణ విషయంలో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై ప్రభుత్వం కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ ఏబీ పాండ్యా నేతృత్వంలో నిఫుణుల కమిటీ ఏర్పాటుచేయడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ఈ కమిటీ ఎలాంటి జాప్యం చేయకుండా రిపేర్ పనులు ప్రారంభించాలని కోరారు. ఇప్పటికే మేడిగడ్డ వద్ద నిల్వ చేయకపోవడంతో నీళ్లన్నీ సముద్రం పాలయ్యాయని తెలిపారు. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లకు ఏమీ కాలేదని తేల్చి చెప్పారు. మేడిగడ్డ మూడు పిల్లర్లను మరమ్మతు చేసి, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో నీళ్లు నింపాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని వినోద్‌కుమార్ కోరారు.