Rain Alert | తెలంగాణలో మరో ఐదురోజులు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మొన్నటి వరకు ఎండలు దంచికొట్టగా.. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఉష్ణోగత్రలు భారీగా పడిపోయాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో మంగళవారం నుంచి శనివారం వర్షాలు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వానలు పడుతాయని చెప్పింది. రాబోయే మూడురోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.
మంగళవారం వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో పలుచోట్ల గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ.. వడగండ్ల వానలు పడే అవకాశాలున్నాయని హెచ్చరించింది. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో వడగళ్ల వానలు పడుతాయని.. ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వస్తాయని పేర్కొంది.
మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వానలు కురుస్తాయని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని పేర్కొంది. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడుతాయని హెచ్చరించింది.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి సహా పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. గురు, శుక్ర, శనివారాల్లో హైదరాబాద్‌తో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలతో వానలు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది. ఇదిలా ఉండగా.. గడిచిన 24గంటల్లో హైదరాబాద్, సిద్దిపేట, హన్మకొండ, భువనగిరి, వరంగల్, కామారెడ్డి, ములుగు సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసినట్లు టీజీడీపీఎస్ వివరించింది.