Red Alert | తెలంగాణలో రాగల ఐదురోజులు భారీ వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఉపరిత ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలను ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని పేర్కొంది. ఉపరితల ఆవర్తనం సగటున సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల వరకు విస్తరించి.. దక్షిణ దిశగా వంగి ఉందని పేర్కొంది. రాగల 24గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బలపడే అవకాశం ఉందని.. 48గంటల్లో ఏపీ, దక్షిణ ఒడిశా మీదుగా కదిలే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ కే నాగరత్న తెలిపారు. తూర్పు-పశ్చిమ ద్రోణి ఈశాన్య ఆరేబియా సముద్రం వరకు కచ్‌ను ఆనుకొని, ఎగువ వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా, తెలంగాణ, ఉత్తర మహారాష్ట్ర, సౌత్ గుజరాత్ ప్రాంతాల మీదుగా అల్పపీడనానికి అనుబంధంగా ఆవర్తనం సముద్రమట్టానికి 3.1-5.8 కిలోమీటర్ల మధ్య దక్షిణం వైపు వంగి ఉందని చెప్పారు.
ఈ క్రమంలో తెలంగాణలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. గురువారం మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఐఎండీ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. కొత్తగూడెం, జయశంకర్, కామారెడ్డి, మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, ములుగు, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది. ఆదిలాబాద్, హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, జోగులాంబ గద్వాల, కరీంనగర్, ఖమ్మం, ఆసిఫాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ నెల 15 నుంచి 17 వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ వివరించింది.