ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం ఫలితంగా విలువైన స్థలాలు అక్రమార్కుల పాలవుతున్నాయి. ఆక్రమిత భూములకు తప్పుడు దస్తావేజులు సృష్టించి అమ్మకానికి పెడుతున్నారు. ఆలస్యంగా మేల్కొన్న అధికారులు చర్యలకు సిద్ధమ వుతుంటే.. భూములు కొన్న సామాన్యుడే సమిధగా మారుతున్నాడు.
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలంలోని కుర్మల్‌గూడలో 12-13 ఎకరాల ప్రభుత్వ భూమి కర్పూరంలా కరిగిపోతున్నది. సర్వే నంబర్ 46లోఉన్న ఈ భూములపై కన్నేసిన అక్రమార్కులు కుర్మల్‌గూడ పంచాయతీ పేరుమీద 20ఏండ్ల కిందటి పర్మిషన్ను తెరపైకి తెచ్చి, వాటి ఆధారంగా నకిలీ డాక్యుమెంట్లను సృష్టించారు. వందగజాలకు 20లక్షల వెలకట్టి ప్రభుత్వ భూమిని అమ్మేస్తున్నారు. స్థానికుల ఫిర్యాదుతో తహసిల్దార్ విచారణ జరిపారు. అది ముమ్మాటికీ ప్రభుత్వ భూమేనని తేల్చారు. 50వరకు అక్రమ నిర్మాణాలను గుర్తించారు. వాటిని కూల్చేందుకు రక్షణ కల్పించాలంటూ రెవెన్యూ అధికారులు పోలీసులకు లేఖ రాశారు.
Ragareddy | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జనవరి 26 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ భూములను కాపాడాల్సిన యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. 20 ఏండ్ల కిందటి జీపీ పర్మిషన్తో ఏకంగా సర్కారు భూములకే ఎసరుపెడుతున్నారు. అడ్డదారిన విద్యుత్తు మీటర్లు, ఇంటి నంబర్లు తెచ్చుకొని సక్రమమంటూ అమ్మకాలకు పెడుతున్నారు. బహిరంగ మార్కెట్‌తో పోలిస్తే తక్కువకు వస్తుందనే ఆశతో సామాన్యులు సులువుగా వారి బుట్టలో పడుతున్నారు. తీరా… ఫిర్యాదులు రాగానే అధికార యంత్రాంగం నిద్రలేస్తున్నది. ఇది ప్రభుత్వ భూమైనందున అక్రమ నిర్మాణాలంటూ తేల్చి చెప్తున్నది. పుణ్యకాలం కాస్తా గడిచిపోవడంతో పైసా పైసా కూడబెట్టుకున్న సామాన్యుడు సమిధగా మారుతున్నాడు. సర్కారు భూముల పేరిట అక్రమార్కులు కోట్లు గడిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు రెవిన్యూ డివిజన్ బాలాపూర్ మండలంలోని కుర్మల్‌గూడలోని పదెకరాలకు పైగా ప్రభుత్వ భూమిలో ఇదే తంతు జరిగింది. హెచ్ఎండీఏ అధికారిక లేఅవుట్‌కు ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమి రోజుల వ్యవధిలోనే హారతి కర్పూరంలా కరిగిపోతున్నా ఆదిలోనే అడ్డుకోవడంలో యంత్రాం గం విఫలమైందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తీరా.. పలు నిర్మాణాలు వెలిసిన తర్వాత తాజాగా వాటిని కూల్చివేసేందుకు పోలీసు బలగాలు కావాలని లేఖ రాయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
పాత ఇండ్ల పట్టా జిరాక్స్‌తో నకిలీ డాక్యుమెంట్స్
కుర్మల్‌గూడ గ్రామ పరిధిలోని 46 సర్వేనెంబరులో సుమారు 36 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. ఇందులో కొన్ని దశాబ్దాల కిందట ఏడెనిమిది ఎకరాల్లో నిరుపేదలకు ఇందిరమ్మ పట్టాలు పంపిణీ చేశారు. మిగిలిన దానిలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో హెచ్ఎండీఏ 16.30 ఎకరాల్లో అధికారికంగా లేఅవుట్ చేసింది. 2022లో లేఅవుట్ చేసి… 2023లో ఈ-వేలం ద్వారా అనేక ప్లాట్లను విక్రయించింది. ఇందులో చదరపు గజం గరిష్ఠంగా రూ.33వేల వరకు ధర పలికిందంటే ఎంత విలువ ఉన్న భూములో అర్థం చేసుకోవచ్చు. కాగా, ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు, హెచ్ఎండీఏకు లేఅవుట్ పోగా… ఈ సర్వేనంబర్‌లో దాదాపు 12-13 ఎకరాల భూములు ఖాళీగానే ఉన్నాయి. వీటిపై అక్రమార్కుల కన్నుపడింది. రోజుకు కొంత చొప్పున నెమ్మదిగా ఈ భూములకు ఎసరు పెడుతున్నా రు. వాస్తవానికి 2013 వరకు కుర్మల్‌గూడ గ్రా మపంచాయతీగా ఉన్నది. అదే సంవత్సరంలో ఈ గ్రామాన్ని బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి తీసుకువచ్చారు. దీంతో పాత ఇండ్ల పట్టాల జిరాక్స్‌లతో నకిలీ డాక్యుమెంట్లు, 2005నాటి సర్పంచ్ హయాంలో ఇచ్చినట్టుగా నకిలీ పొజిషన్ సర్టిఫికెట్లు తయారుచేసి వంద గజాల చొప్పున ప్లాట్లను చేసి విక్రయించడం మొదలుపెట్టారు. హెచ్ఎండీఏ వేలంలో గజం రూ.30వేలకు పైగా అమ్ముడుపోయిందంటూ వంద గజాల ప్లాట్లను రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలకు అమ్ముతున్నారు. దీంతో తక్కు వ ధరకు వస్తున్నాయంటూ కొనుగోలు చేసి సామాన్యులు సులువుగా మోసపోతున్నారు.
చర్యలకు దిగేలోపే ఇబ్బడిముబ్బడిగా
అధికార యంత్రాంగం చూసీ చూడనట్టుగా వ్యవహరించడంతో చివరకు స్థానికులు కొందరు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆర్డీవో ఆదేశానుసారం ఎట్టకేలకు కొన్నిరోజుల కిందట క్షేత్రస్థాయిలో పరిశీలించిన బాలాపూర్ తహసీల్దార్ ఏకంగా 50 అక్రమ నిర్మాణాలు వెలిసినట్టుగా గుర్తించినట్టు తెలిసింది. అయితే వాస్తవానికి వెంటనే వాటిని కూల్చివేయాల్సి ఉండగా… పోలీసుల రక్షణతో కూల్చివేతలు చేపట్టేందుకు నిర్ణయించారు. ఈ నెల 22న సర్వే నంబర్ 46లో వెలిసిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు పోలీసు బలగాల సహకారాన్ని అందించాలని బాలాపూర్ తహసీల్దార్ మాధవీరెడ్డి ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు లేఖ రాశారు. అయితే ఆరోజు అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా వేడుకలు జరుగుతున్నందున బలగాలను ఇవ్వలేమని చెప్పారు. ఆ తర్వాతైనా కూల్చివేతలు చేపట్టాల్సి ఉన్నప్పటికీ నేటికీ అవి కార్యరూపం దాల్చలేదు. దీంతో రాత్రికి రాత్రి మరిన్ని అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. అమాయకులు లక్షల రూపాయలు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. కాగా దీనిపై బాలాపూర్ తహసీల్దార్ మాధవీరెడ్డిని ‘నమస్తే తెలంగాణ’ వివరణ కోరగా… కూల్చివేతలు చేపట్టాలంటే పోలీసుల సహకారం కావాలని, అం దుకే బలగాలను ఇవ్వాలని కోరామని చెప్పారు. ఇప్పటివరకు పోలీసులనుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. ఆదిబట్ల సీఐని సంప్రదించగా.. తగినంత బలగాలు లేనందున తాము వెంటనే ఇవ్వలేకపోయామని, రెండు, మూడు రోజుల్లో ఇస్తామని చెప్పారు.
అక్రమార్కులకు ఊతమిస్తున్న అధికారులు
వాస్తవానికి ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన బాధ్యత అన్ని శాఖలపైనా ఉంటుంది. కానీ కొన్ని శాఖల అధికారుల తీరు అక్రమార్కులకు వరంగా మారింది. సరైన డాక్యుమెంట్లు లేకుండా.. అసలు అది ప్రభుత్వ భూమా? పట్టా భూమా? ఇవేవీ చూడకుండానే విద్యుత్తు శాఖ నుంచి కరెంటు మీటరు జారీ అవుతున్నది. కిందిస్థాయి యంత్రాంగం డబ్బులు దండుకొని కేవలం వారం రోజుల్లోనే మీటరు, కరెంటు కనెక్షన్ ఇస్తున్నారు. దీంతో ఈ భూముల్లో రాత్రికి రాత్రి నిర్మాణాలు వెలుస్తున్నాయి. వీటిని అడ్డుకోవాల్సిన మున్సిపల్ కార్పొరేషన్ సైతం ఇంటి నంబర్లు ఇచ్చి అక్రమార్కులకు వత్తాసు పలుకుతున్నది. ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు వెలిసినప్పటికీ బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పలువురికి ఇండ్ల నంబరు కూడా కేటాయించడం గమనార్హం.