హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 21(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని రెండు ప్రధాన దేవాలయాల్లో ఆమె పనిచేసిన సమయంలో ఆ కార్యనిర్వాహణాధికారిదే హవా! తన హయాంలో పనిచేసిన సూపరింటెండెంట్లు ఎంత పెద్ద తప్పు చేసినా.. వారిని కాచి తన పబ్బం గడుపుకోవడంలో ఆ అధికారి తనకు తానే సాటి అని రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యాలయంలో చెప్పుకుంటారు. గతంలో పనిచేసిన దేవాలయంలో తన అనుచరుడైన సూపరింటెండెంట్‌ను కాపాడిన ఆ ఈవో.. ప్రస్తుతం తాను పనిచేస్తున్న ఆలయంలో ఓ ఉద్యోగి చేతివాటం కనబరిచినట్టు సాక్ష్యాలు ఉన్నప్పటికీ, నామమాత్రపు చర్యలతో సరిపెట్టారు తప్ప సీరియస్ చర్యలు లేకపోవడంతో పెద్ద దేవాలయాల సిబ్బందిలో ఇదే విషయంపై పెద్దఎత్తున చర్చ జరుగుతున్నది.
ఆగస్ట్‌లో ఈ కార్యనిర్వహణాధికారి పనిచేస్తున్న ప్రధాన ఆలయంలో సహాయ కార్యనిర్వహణాధికారిగా ఉన్న ఓ ఉద్యోగి హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో పర్యవేక్షకుడితో అనుచితంగా వ్యవహరించడంతోపాటు బొగ్గులకుంట ఎండోమెంట్ కార్యాలయంలోని సెక్షన్ ఉద్యోగికి ఫోన్‌పే ద్వారా డబ్బు పంపించారు. దీన్ని మర్యాదపూర్వకంగా పంపానని, మరోలా అనుకోవద్దంటూ మెసేజ్ కూడా పెట్టారు. తన స్మార్ట్‌ఫోన్‌కు వచ్చిన డబ్బుల విషయంపై సెక్షన్ ఉద్యోగి తన ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేయగా, వారు ఈ కార్యనిర్వహణాధికారిని విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తూతూమంత్రంగా విచారణ జరిపిన సదరు కార్యనిర్వహణాధికారి తన సహాయ ఉద్యోగిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా మందలించి వదిలేశారు. దీనిపై ఇప్పటికీ దేవాదాయ శాఖలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. అసలు అతను ఏం ఆశించి ప్రధాన కార్యాలయ ఉద్యోగికి డబ్బులు పంపారో పూర్తి విచారణ ఎందుకు జరపలేదని చర్చించుచుంటున్నారు.
తాజాగా స్టోర్స్ వివాదం
ఇదిలాఉంటే కార్యనిర్వహణాధికారి అక్కడినుంచి తన మాతృశాఖకు బదిలీ అయ్యారు. దీంతో తాను దేవాదాయ శాఖను వదిలేది లేదంటూ పై స్థాయిలో పైరవీలు చేసి తిరిగి అదే నెలలో మళ్లీ ఉత్తర తెలంగాణలో మరో ముఖ్య దేవాలయానికి ఈవోగా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. తన మాతృ శాఖను కాదని నిబంధనలకు విరుద్ధంగా కొన్నేండ్లుగా ఎండోమెంట్లోనే కొనసాగుతున్న ఈ కార్యనిర్వహణాధికారి ప్రస్తుతం పనిచేస్తున్న దేవాలయంలోనూ ఇటీవల స్టోర్స్‌కు సంబంధించి ఒక వివాదం తెరపైకి వచ్చింది.
తన వద్ద పనిచేస్తున్న ఉద్యోగి స్టోర్స్ నుంచి కొంత సామగ్రిని తరలించుకువెళ్తున్న దృశ్యాలు వైరల్ అయినప్పటికీ అవి సరైనవి కావని, అందులో స్టోర్స్ సామాను లేదని, గులాబ్‌జామ్ ఉన్నదంటూ ఏదో ఒకటి చెప్పిన అతనిని సెక్షన్ మార్చిచేతులు దులిపేసుకున్నారు. ఈ వ్యవహారం రాష్ట్ర ఎండోమెంట్ కార్యాలయం వరకు చేరకుండా మేనేజ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. కమిషనర్ స్వయంగా ఉత్తర్వులు ఇచ్చి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినా ఆ ఈవో మాత్రం తన అనుకూలమైన సిబ్బందిని మందలింపులతో సరిపెడుతున్నారే తప్ప వారి తప్పులు సరిదిద్దకపోవడంపై దేవాదాయ శాఖలో పెద్దఎత్తున చర్చ జరుగుతున్నది.