ఇటీవల ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఒక రైస్ మిల్లుపై దాడి చేయగా, నకిలీ మద్యం పరిశ్రమ బయటపడింది. ప్యాక్ చేసి సరఫరాకు సిద్ధంగా ఉంచిన కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.15 లక్షలు. దీంతోపాటు రూ.2 కోట్ల విలువైన స్పిరిట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని కృష్ణపద్మ అనే స్పిరిట్ కంపెనీ నుంచి టన్నుల కొద్దీ స్పిరిట్‌ను కొనుగోలు చేసినట్టు అధికారులు గుర్తించారు.
హైదరాబాద్ కుషాయిగూడలో నకలీ మద్యం లేబుళ్ల తయారీ ప్రింటింగ్ యూనిట్‌ను గుర్తించారు. రూ.30 లక్షల విలువైన కలర్ లేబుళ్ల తయారీ ప్రింటర్‌తోపాటు, రూ.20 లక్షల విలువ చేసే నకిలీ లేబుళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీరు ఎవరెవరికి లేబుళ్లు సరఫరా చేశారనే దానిపై విచారణ జరుగుతున్నది.
రెండు నెలల కిందట మహబూబాబాద్ జిల్లాలో నకిలీ మద్యం తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. రూ.4 లక్షల విలువ చేసే 2,688 నకిలీ మద్యం సీసాలు, 4,500 ఖాళీ సీసాలు, 1,755 లేబుళ్లు, 2 వేల మూతలు, 60 లీటర్ల స్పిరిట్‌ను స్వాధీనం చేసుకున్నారు.
నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : పైవన్నీ మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. రాష్ట్రవ్యాప్తంగా బయటపడినవి, బయటకు రానివి ఇంకా ఎన్నో ఉన్నాయి. సూటిగా చెప్పాలంటే రాష్ట్రం నకిలీ మద్యం తయారీ మాఫియాకు అడ్డాగా మారింది. ప్రభుత్వ వైఫల్యం, కొందరు పెద్దల అండతో చాపకింది నీరులా రాష్ట్ర మంతటా విస్తరించింది. ఒకేచోట రూ.2 కోట్ల స్పిరిట్ పట్టుబడిందంటే నకిలీ మద్యం మాఫియా ఏ స్థాయిలో విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు. మూతపడిన రైస్ మిల్లులు, మూసివేసేందుకు సిద్ధంగా ఉన్న పరిశ్రమలను కేంద్రంగా చేసుకొని ఈ నకిలీ మద్యం పరిశ్రమ రాజ్యమేలుతున్నది. పొరుగు రాష్ట్రాల నుంచి లారీలకు లారీలు రెక్టిఫైడ్ స్పిరిట్‌ను దింపి, ఖరీదైన మద్యంగా మార్చేస్తున్నారు. తద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా గండికొట్టటంతోపాటు, మందుబాబుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఒకప్పుడు గోవా, మహారాష్ట్ర, ఒడిశాల్లో తయారైన అక్రమం మద్యం తెలంగాణలోకి అడ్డదారుల్లో దిగుమతి అయ్యేదని, కానీ ఇప్పుడు తెలంగాణే తయారీ కేంద్రంగా మారిందని ఎక్సైజ్ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. తెలంగాణలోని మారుమూల పల్లెలు మొదలుకొని దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ర్టాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగినట్టు తెలుస్తున్నది. ఇలా రాష్ట్రంలో జరుగుతున్న నకిలీ మద్యం దందా విలువెంతో తెలుసా? నెలకు అక్షరాలా రూ.200 కోట్ల మేర నకిలీ మద్యం దందా నడుస్తున్నట్టు ఎక్సైజ్ శాఖ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దందా వెనుక పెద్దలు ఉండటంతో ఎక్సైజ్ పోలీసులు అడపాదడపా కేసులతోనే సరిపెడుతున్నారే తప్ప మూలాల్లోకి వెళ్లడం లేదని అరోపణలు వినిపిస్తున్నాయి.
నకిలీ మద్యం మాఫియా హైదరాబాద్ పరిసరాల్లోని జీడిమెట్ల, కాటేదాన్ తదితర ఇండస్ట్రియల్ కారిడార్లలో మూతబడిన, దాదాపు మూతపడే స్థితిలో ఉన్న పరిశ్రమలను గుర్తించి, వాటిని నకిలీ మద్యం తయారీ కేంద్రాలుగా మార్చుతున్నట్టు పొరుగు రాష్ర్టాల ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు చెప్తున్నాయి. పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించే ఇథైల్ ఆల్కహాల్‌ను (రెక్టిఫైడ్ స్పిరిట్) మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల నుంచి భారీ ఎత్తున దిగుమతి చేసుకొని, ఆయా పరిశ్రమలకు తరలిస్తున్నట్టు సమాచారం. రెక్టిఫైడ్ స్పిరిట్‌కు నీళ్లు, క్యారామిల్, బ్రాండ్‌ను బట్టి విసీ ఎసెన్స్ కలిపి నకిలీ మద్యం తయారు చేస్తున్నట్టు చెప్తున్నారు. ముందే వైన్ షాపుల నుంచి ఖాళీ క్వార్టర్, హాఫ్, ఫుల్ బాటిళ్లను సేకరించి గోదాముకు చేర్చుతున్నారట. పరిశ్రమలో తయారు చేసిన నకిలీ మాద్యాన్ని ఆయా సీసాల్లో నింపి మూతలు పెట్టి క్యాప్ సీల్ వేస్తున్నట్టు తెలిసింది. టీజీబీసీఎల్ అట్టపెట్టెలను మద్యం దుకాణాల నుంచి రూ.10కి ఒకటి చొప్పున కొనుగోలు చేసి, వాటిల్లో నకిలీ మద్యం సీసాలను ప్యాక్ చేసి ఎగుమతి చేస్తున్నట్టు ఎక్సైజ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
కర్ణాటకలోని హుబ్లి, కోలార్, గంగావతి, మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి ప్రైవేటు ట్రాన్స్‌పోర్టులో బ్యూటేన్, ప్రొఫేన్ కెమికల్ పేరుతో ఇథైల్ ఆల్కహాల్ డ్రమ్ముల్లో తెప్పిస్తున్నట్టు సమాచారం. మద్యం సీసాలపై అతికించే లేబుళ్లు, మూతల సీళ్లు, మద్యం రుచికోసం ఉపయోగించే క్యారామిల్, మద్యం ఇంగ్రీడియంట్స్‌ను (ఎసెన్స్) సర్జికల్ కిట్ల పేరుతో దిగుమతి చేసుకుంటున్నట్టు తెలిసింది. ఈ దందా, నగదు లావాదేవీలు హవాలా పద్ధతిలో సాగుతున్నాయని పొరుగురాష్ర్టాల పోలీసులు చెప్తున్నారు. ముంబై పోలీసుల వివరాల ప్రకారం.. మాఫియా గ్యాం గ్లు తెలంగాణలో పలుచోట్ల కిళ్లీ కొట్లు, సెల్ ఫోన్ దుకాణాల రూపంలో ఆఫీసులు తెరిచాయని, వారే కర్ణాటక, మహారాష్ట్రల్లోనూ దుకాణాలు తెరిచారని, ఆయా బ్రోకర్ల ద్వారా ఈ వ్యాపారం నడిపిస్తున్నారని చెప్తున్నారు.
గ్రామాల్లో పేరుమోసిన చీప్, మీడియం లిక్కర్ బ్రాండ్లను తయారుచేసి బెల్ట్ దుకాణాలకు నేరుగా సరఫరా చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌లో ప్రీమి యం మద్యం కొనుగోలు చేసే సంస్కృతి బాగా పెరిగింది. రూ.1,500, ఆపై విలువైన ప్రీమియం బ్రాండ్ల మద్యానికి మంచి డిమాం డ్ ఉన్నట్టు ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు. సైబరాబాద్ ప్రాంతంలో విదేశీ మద్యం విక్రయాలు ఎక్కువగా ఉంటాయని ఎక్సైజ్ నివేదికలు చెప్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఖరీదైన సాచ్ బాటిళ్లతోపాటు, రాష్ట్రంలోని కొన్ని ప్రముఖ బ్రాండ్లకు చెందిన మద్యంలో కల్తీ జరుగుతున్నట్టు ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రీమియం స్కాచ్ బాటిళ్లలో కొంత స్కాచ్ తీసేసి చీప్ లికర్, మీడియం లిక్కర్‌తో కల్తీ చేస్తున్నట్టు ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి. నిజానికి తెలంగాణలో ప్రీమియం బ్రాండ్లకు సెక్యూరిటీ ఫీచర్స్ ఎక్కువగా ఉంటాయి. సాధారణ మూతల స్థానంలో గోలా మూతలు ఉంటాయి. గోలా మూతలతో సీసాలోంచి మద్యాన్ని బయటకు తీసుకొస్తే గానీ సీసాలోకి తిరిగి మద్యం పోసేందుకు అవకాశం ఉండదు. బాటిల్ మూతలపై క్యూఆర్ కోడ్, బార్ కోడ్ ఉండే లేబుళ్లు ఉంటాయి. దీనికి డీకోడ్ చేయడం ద్వారా మద్యం అసలుదా? నకిలీదా? అని సునాయాసంగా గుర్తించవచ్చు. వీటిని ఛేదించేందుకు నిపుణులను ముంబై నుంచి దింపినట్టు విశ్వసనీయ సమాచారం. 3 ఇంచుల సైజులో ఉండే ఒక కనెక్టర్‌తో లేబుల్ ఏమాత్రం చిరిగిపోకుండా మూతలు తీస్తున్నారని, బాటిల్ నుంచి అసలు మద్యం తీసి, దాని స్థానంలో చీప్ లిక్కర్, మీడియం లిక్కర్ కలిపి, తిరిగి యథావిధిగా మూతను బిగిస్తున్నారని సమాచారం. వీటిని ఎయిర్పోర్ట్, ఢిల్లీ మద్యం పేరుతో ఎమ్మార్పీ కంటే తక్కువ ధరకు విక్రయిస్తున్నట్టు తెలుస్తున్నది. నకిలీ మద్యాన్ని హైదరాబాద్ నుంచి ప్రైవేట్ బస్సులు, పార్సిల్ సర్వీసుల ద్వారా పొరుగు రాష్ర్టాలకు ఎగుమతి చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
నకిలీ మద్యం దందాలో వినియోగించే ఇథైల్ ఆల్కహాల్, ప్రాణాంతకమైన మిథైల్ ఆల్కహాల్‌ను పారిశ్రామిక అవసరాలకు ఉపయోగిస్తారని ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు. ఇవి రంగు, రుచి, వాసనలో ఒకే తీరుగా ఉం డటంతో పెను ప్రమాదానికి అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇథైల్ ఆలహాల్ స్థానంలో పొరపాటున మిథైల్ ఆలహాల్ కలిస్తే ఎంతమంది తాగితే అంత మంది తీవ్ర అస్వస్థతకు గురికావడం, మృత్యువాత పడటం ఖాయమని హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా నకిలీ మద్యం చావులకు మిథైల్ ఆలహాలే కారణమని నివేదికలే చెప్తున్నాయి.
రాష్ట్రంలోని ఏ4 మద్యం దుకాణాలకు నవంబర్ 30తో లైసెన్స్ గడువు ముగుస్తుంది. ఇప్పటికే దుకాణదారులు ప్రివిలేజ్ కోటా మద్యాన్ని పూర్తిగా విక్రయించారని తెలిసింది. ఇక మీదట విక్రయించే మద్యంపై 10 నుంచి 12 శాతం మించి మార్జిన్ ఉండదని దుకాణాదారులు చెప్తున్నారు. ఈ మార్జిన్‌తో దుకాణం రెంటల్, ఉద్యోగుల జీతం కూడా వెళ్లదని అంటున్నారు. ఎలాగూ లైసె న్స్ గడువు సమీపించడంతో మళ్లీ లైసెన్స్ వస్తుందో రాదోనని, అవకాశం ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనుకేసుకోవాలనే ఆలోచనతో కొందరు వ్యాపారులు నకిలీ మద్యం వైపు మళ్లుతున్నారు. దీనిని గ్రామాల్లోని బెల్ట్ షాప్‌లకు సరఫరా చేసి విక్రయిస్తున్నట్టు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. నకిలీ మద్యం తయారీదారులు మధ్యవర్తికి ఒకో కేసు చీప్ లిక్కర్ (క్వార్టర్ బాటిళ్లు అయితే 48, ఫుల్ బాటిళ్లు అయితే 12) రూ.3,100 చొప్పున అమ్ముతున్నారని, వారి నుంచి దుకాణం యజమానికి రూ.3,600కు, అక్కడి నుంచి బెల్ట్ షాపులకు రూ.5,500 చేరుతున్నదని తెలిసింది. బెల్ట్ దుకాణాల వారు రూ.7,680కి వినియోగదారులకు అమ్ముతున్నట్టు ఎక్సైజ్ వర్గాల ద్వారా తెలుస్తున్నది. ప్రివిలేజ్ కోటా ముగిసిన తర్వాత ఇదే మద్యాన్ని టీజీబీసీఎల్ ద్వారా కొనుగోలు చేసి విక్రయిస్తే రూ.456.20 మాత్రమే వస్తుందని దుకాణదారులు చెప్తున్నారు. నకిలీ మద్యంతో అంతకు నాలుగైదు రెట్లు వస్తున్నట్టు సమాచారం. ఇలా మాఫియా దెబ్బకు గత రెండు నెలల నుంచి మద్యం విక్రయాలు భారీగా తగ్గినట్టు ఎక్సైజ్ నివేదికలు చెప్తున్నాయి.