వరంగల్, జనవరి 25 : హనుమకొండ జిల్లా హంటర్‌రోడ్డులో సర్వేనంబర్ 125కేలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ కుటుంబ సభ్యుల నిర్మాణాలను గ్రేటర్ కార్పొరేషన్ టౌన్‌ప్లానింగ్ అధికారులు శనివారం కూల్చివేశారు. తన 400 గజాల స్థలాన్ని మంద జ్యోతి, మంద కృష్ణమాదిగ, ఇద్దయ్య ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని రెండున్నరేళ్ల క్రితం నంబూరి చారుమతి గ్రేటర్ అధికారులకు ఫిర్యాదు చేశారు.
విచారణలో అక్రమణ వాస్తవమేనని తేలడంతో కూల్చివేయాలని 2022లో మున్సిపల్ అధికారులకు ఆదేశాలిచ్చారు. రెండేండ్లు దాటినా కూల్చివేతలు చేపట్టకపోవడంతో బాధితురాలు హెచ్ఆర్సీని ఆశ్రయించారు. దీంతో బల్దియా ఇచ్చిన ఆదేశాలను వెంటనే అమలు చేయాలని కమిషనర్ అశ్విని తానాజీ వాకడేకు హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలను రద్దు చేయాలని మంద కృష్ణమాదిగ హైకోర్టును ఆశ్రయించగా అక్కడ చుక్కెదురైంది. దీంతో అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు.