పొతంగల్, ఏప్రిల్ 25: నిజామాబాద్ జిల్లాలో భాగంగా ఉన్న బాన్సువాడ నియోజకవర్గంలోని పొతంగల్ మండలంలో ఇసుక అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. మండల పరిధిలోని మంజీర నదిలో టీజీఎండీసీ పొతంగల్, కొడిచెర్ల, కారేగాం, హంగర్గా సమీపంలో నాలుగు క్వారీలు ఏర్పాటు చేసింది. ఇవి టీజీఎండీసీ క్వారీలే అయినప్పటికీ, వీటి నిర్వహణలో ప్రైవేట్ వ్యక్తుల పెత్తనం కొనసాగుతున్నది. ధనార్జనే ధ్యేయంగా ఉన్న ఇసుక మాఫియా ప్రభావం ఈ క్వారీలపై కనిపిస్తున్నది. మంజీరలో ఇసుక తవ్వకాలు నిబంధనల మేరకు జరుగడంలేదని, నిర్దేశిత లోతుకన్నా ఎక్కువ లోతులో ఇసుకను తవ్వేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇసుక తవ్వకాలకు యంత్ర పరికరాలు ఉపయోగించరాదన్న నిబంధన సైతం బేఖాతర్ అవుతున్నదని పేర్కొన్నారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇసుక తవ్వకాలు జరగాల్సి ఉండగా, చాలాసార్లు రాత్రి 9 గంటల వరకు ఇసుక తవ్వకాలు జరిపిన సందర్భాలు ఉన్నాయని వెల్లడించారు. ఒకే వే బిల్లుపై టిప్పర్లు, లారీల్లో ఇసుకను అనేకసార్లు రవాణా చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అక్రమ రవాణాకు అలవాటుపడిన కొందరు వ్యక్తులు రాత్రి వేళల్లో మంజీర నదిలోని ఇసుకను ట్రాక్టర్లలో పెద్ద ఎత్తున తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ నిబంధనల ఉల్లంఘన వెనుక పెద్దల హస్తం ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అప్పుడప్పుడు ఇసుక ట్రాక్టర్లను పట్టుకుంటున్నప్పటికీ, పూర్థిసాయిలో అరికట్టడటంలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
తాగునీరు, సాగునీటికి ఇబ్బందులు..
మంజీరను నమ్ముకొని పరీవాహక ప్రాంతంలో రైతులు పంటలు సాగు చేస్తున్నారు. మండలంలో నాలుగు క్వారీల్లో భారీ ఎత్తున తవ్వకాలు జరుపడంవల్ల భూగర్భజలాలు అడుగంటిపోయి సాగునీరు రాని పరిస్థితి నెలకొంటున్నదని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కారేగాం ప్రాంతంలో డీ ఫ్లోరైడ్ స్కీం ద్వారా సమీప గ్రామాలకు సరఫరా అవుతున్న తాగునీరు కూడా ఎత్తిపోయే ప్రమాదం ఉందని వాపోతున్నారు.
అధికారులు పట్టించుకోరు..
ఇసుక రవాణా అరికట్టాలని రైతులు, ప్రజలు, నాయకులు ఆందోళన చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిత్యం వందలాది టిప్పర్లు, లారీలు, ట్రాక్టర్లలో రాత్రింబవళ్లు ఇసుక రవాణా జరుగుతున్నదని స్థానికులు పేర్కొంటున్నారు. ఇసుకలోడు వాహనాలవల్ల వ్యవసాయ భూములు, రహదారులు దెబ్బ తింటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై ఆరబోసిన వడ్లపై నుంచి టిప్పర్లు నడపడంతో వడ్లు పిండిగా మారుతున్నాయని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
అధికారికంగానే రవాణా..
ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ఇసుక రవాణా అధికారికంగానే జరుగుతున్నది. అక్రమ రవాణా జరుగుతున్నట్టు మా దృష్టికి వస్తే తగు చర్యలు తీసుకుంటాం.
– విష్ణు, పొతంగల్ తహసీల్దార్