అది ఎకరా రూ.20-30 కోట్ల విలువ చేసే పదెకరాల భూమి. దానిపై వివాదం కోర్టులో ఇంకా పెండింగులోనే ఉన్నది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారిక రికార్డుల్లో ఆ భూములపై డీఏజీపీఏ (డెవలప్మెంట్ అగ్రిమెంట్, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ) ఉన్నప్పటికీ తప్పడు సమాచారంతో దానిని రద్దు చేశారు. గుట్టుచప్పుడు కాకుండా రాత్రికి రాత్రి ఆ పదెకరాలకు నాలా ఉత్తర్వులు వచ్చాయి. ఆ వెంటనే ఒక తెల్ల కాగితంపై లేఅవుట్ గీయడం పూర్తయింది. అందులోని ప్లాట్లకు సంబంధించి టీఎస్ బీపాస్‌లో దరఖాస్తు చేయడంతో ఇంటి నిర్మాణానికి తాతాల్కిక అనుమతులు వచ్చాయి. దాని ఆధారంగా ఒక్కరోజులో ఏకంగా 18 ప్లాట్లు, మరోరోజు ఐదు ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇదంతా కేవలం పదకొండు రోజుల్లోనే పూర్తయ్యాయి!
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 29 (నమస్తే తెలంగాణ): కర్ర ఉన్నోడిదే బర్రె అనే సామెతకు ఈ ఉదంతం ఓ ఉదాహరణ. సామాన్యుడు ప్రభుత్వ కార్యాలయాల్లో చిన్న పనికి వెళ్లినా సవాలక్ష నిబంధనలతో చుక్కలు చూపించే అధికారులు, పెద్ద తలకాయల రంగ ప్రవేశంతో ‘జీ హుజూర్’ అంటారని మరోమారు తేటతెల్ల మైంది. ఇదే తరహాలో గండిపేట భూ ఆక్రమణ తతంగం 11 రోజుల్లోనే పూర్తికావడం విశేషం. ఇప్పుడు గుట్టురట్టవడంతో ఉన్నతాధికారులు తప్పులను సరిదిద్దుకునేందుకు నానా తంటాలు పడుతున్నారే తప్ప, బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు మాత్రం సాహసించడం లేదు. అన్ని అనుమతులు ఉన్నా హైడ్రా, రెవెన్యూ, ఇరిగేషన్ బుల్డోజర్ల కింద సామాన్యుడి కలల సౌధాలు పేకమేడల్లా కూలిపోతుంటే, ఇక్కడ మాత్రం మున్సిపల్, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు కుమ్మక్కై చట్టాలను చాపలా చుట్టి, నిబంధనల కోరలు పీకి, అక్రమ లేఅవుట్‌కు అధికారిక ముద్ర వేసేశారు. బిగ్ బ్రదర్స్ కనుసన్నల్లో ఈ వ్యవహారం జరిగిందని, తెరవెనుక రూ.కోట్లు చేతులు మారాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. రంగారెడ్డి జిల్లా గండిపేట మండ లం సికిందర్గూడ గ్రామ పరిధిలోని 1/పి, 2, 3, 17/పి, 18/పి సర్వేనంబర్లల్లో పదెకరాల భూమి ఉన్నది.
గ్రామానికి చెందిన బుర్ర జ్ఞానేశ్వర్, వారి కుటుంబ సభ్యులకు చెందిన ఈ భూమిని అభివృద్ధి చేసి, విల్లాలు నిర్మించేందుకు 2008లో ఒక ప్రైవేటు నిర్మాణ సంస్థ వారితో ఒప్పందం కుదుర్చుకున్నది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నిబంధనల ప్రకారం డీఏజీపీఏ చేసుకుంది. నిర్మాణ సంస్థ ఒప్పంద సమయంలో జ్ఞానేశ్వర్ కుటుంబానికి రూ.5.5 కోట్లు అడ్వాన్సుగా చెల్లించింది. అనంతరం ఆ భూములు తమవంటూ ఇతరులు రావడంతో వివాదం సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. 2022లో సుప్రీంకోర్టు ఆ భూములు జ్ఞానేశ్వర్ కుటుంబానికి చెందినవిగా తేల్చింది. ఈ తీర్పు ఆధారంగా రెవిన్యూ శాఖ వారి పేరిట ధరణి పాసు పుస్తకాలు జారీ చేసింది. భూ వివాదం పరిష్కారం కావడంతో 2008లో చేసుకున్న ఒప్పందం మేరకు పనులు మొదలుపెట్టేందుకు నిర్మాణ సంస్థ ముందుకు రాగా.. జ్ఞానేశ్వర్ కుటుంబం తాము ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని చెప్పారు. దాదాపు దశాబ్దంన్నర కిందట తాము చెల్లించిన రూ.5.5 కోట్ల పరిస్థితి ఏమిటని నిర్మాణ సంస్థ ప్రశ్నించడంతోపాటు ఆర్బిట్రేషన్ కోసం వాణిజ్య వివాదాల ప్రధాన ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. భూ యజమానులు కూడా న్యాయపరంగా ముందుకుపోవడంతో దాదాపు రెండేండ్లపాటు ఆ వివాదం కొనసాగింది. చివరకు ఆరు శాతం వడ్డీ ప్రాతిపదికన భూ యజమానులు నిర్మాణ సంస్థకు రూ.5.5 కోట్ల మొత్తాన్ని చెల్లించాలని తీర్పు వచ్చింది. దీనిపై నిర్మాణ సంస్థ మళ్లీ అప్పీలుకు వెళ్లింది. ఈ వివాదం కోర్టులో పెండింగులో ఉన్నది.
‘బిగ్’ డీల్‌తో మారిన సీన్
సికిందర్గూడలో ఎకరా భూమి విలువ రూ.20-30 కోట్ల మధ్య ఉంటుందని స్థానికులు చెప్తున్నారు. న్యాయస్థానంలో వివాదం కొనసాగుతుండగానే పదెకరాల భూమిని చేతులు మార్చాలని భూ యజమానులు ప్రయత్నించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన పలువురు మాజీ ప్రజాప్రతినిధులను ఆశ్రయించడంతో వ్యవహారం బిగ్ బ్రదర్ దగ్గరకు చేరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. నిర్మాణ సంస్థకు సంబంధం లేకుండా భూ స్వరూపాన్ని మార్చితే సరిపోతుందని వారు నిర్ణయించుకున్నట్టు సమాచారం. వారి నుంచి రెవిన్యూ, మున్సిపల్, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు ఫోన్లు వెళ్లాయట. అంతే.. గత నెల 29న వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మారుస్తూ నాలా మార్పిడి ఉత్తర్వులు వచ్చినట్టు సమాచారం. రెండు రోజులు గడవకముందే బుర్ర జ్ఞానేశ్వర్ కుటుంబం అనధికారికంగా భూ పంపిణీ చేసుకున్నారు. సగం భూమిలో కాగితం మీద లేఅవుట్ గీయించారు. ఒక దేవాలయానికి కొంత స్థలం, రహదారులు మినహా మరే ఇతర ప్రజా ప్రయోజనాలకు స్థలాలను వదలకుండానే ప్లాట్లుగా విభజించారు. 2031 మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా ఈ భూముల్లో నుంచే వంద ఫీట్ల రహదారికి ప్రభుత్వం ప్రతిపాదించగా, అక్రమ లేఅవుట్లో దానికీ తిలోదకాలిచ్చారు.
అంతా కుమ్మక్కై రిజిస్ట్రేషన్లు
అక్రమ లేఅవుట్లో ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు ‘బిల్డ్ నౌ’ పోర్టల్‌లోని వెసులుబాటును ఆసరాగా చేసుకున్నారు. సాధారణంగా నిర్మాణ అనుమతుల కోసం వెబ్సైట్లో దరఖాస్తు చేసుకునే సందర్భంలో అన్ని రకాల వివరాలను పొందుపరిచి, 14% ఎల్ఆర్ఎస్, ఇతరత్రా ఫీజులు చెల్లిస్తే వెంటనే తాత్కాలిక భవన అనుమతుల ఉత్తర్వులు వస్తాయి. కుట్రదారులు ఇదే పద్ధతిని అనుసరించి, తాత్కాలిక నిర్మాణ అనుమతులు తీసుకున్నారు. వాటి ఆధారంగా గండిపేట సబ్ రిజిస్ట్రార్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేపట్టారు. ఈ నెల 3న ఒకేరోజు సుమారు 2,798 చదరపు గజాల విస్తీర్ణంలోని 18 ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను చకాచకా పూర్తి చేశారు. అనంతరం ఐదో తేదీన మరో ఐదు ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేశారు. ఇలా మొత్తం 25 ప్లాట్లను తాత్కాలిక భవన నిర్మాణ అనుమతుల ఉత్తర్వుల ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయడం విశేషం.
బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఐదు ప్లాట్లకు తుది భవన నిర్మాణ అనుమతులను కూడా జారీ చేశారు. ఇలా రెండు శాఖల అధికారులు కలిసి అక్రమ లేఅవుట్‌కు అధికారిక ముద్ర వేసేశారు. తాత్కాలిక భవన అనుమతుల ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేయొద్దని నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. అనధికారిక లేఅవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు సంబంధించి ‘2020 కంటే ముందు లే అవుట్ వేసి ఉండి, అప్పటికే పది శాతం ప్లాట్లు రిజిస్ట్రేషన్లు పూర్తయితేనే తదుపరి ప్లాట్లను ఎల్ఆర్ఎస్ ఫీజుతో సహా రిజిస్ట్రేషన్ చేయాలి’ అని అనధికారిక లేఅవుట్ నిబంధనలు-2020 చెప్తున్నది. అయినా సదరు సబ్ రిజిస్ట్రార్ వీటన్నింటినీ తుంగలో తొక్కి అక్రమ రిజిస్ట్రేషన్ల జాతర కొనసాగించారు.
ఆన్లైన్లో తప్పుడు ఎంట్రీ
ఈ భూములకు సంబంధించి 2008లో నిర్మాణ సంస్థతో డీఏజీపీఏ అయినట్లుగా రిజిస్ట్రేషన్ శాఖ ఆన్లైన్లో నమోదై ఉంది. దీనిని రద్దు చేయాలంటే భూ యజమానులతో పాటు నిర్మాణ సంస్థ కూడా పరస్పర అవగాహనకు వస్తేనే సాధ్యమవుతుంది. కానీ భూ యజమానులు ఇచ్చిన ఒక లేఖ ఆధారంగా సబ్ రిజిస్ట్రార్ డీఏజీపీఏను రద్దు చేశారు. హైకోర్టు తీర్పు మేరకు దీనిని రద్దు చేస్తున్నట్లుగా తప్పుడు ఎంట్రీ చేశారు. ఇది ఆలస్యంగా నిర్మాణ సంస్థ వారికి తెలియడంతో వెంటనే గండిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. అసలు హైకోర్టు తీర్పు ఎక్కడిది? అని ప్రశ్నించడంతో సబ్ రిజిస్ట్రార్ ఆన్లైన్లో దానిని తొలగించి, ఆర్బిట్రేషన్‌లో భాగంగా వచ్చిన తీర్పు ఆధారంగా రద్దు చేస్తున్నటు మళ్లీ నమోదు చేశారు. వాస్తవానికి ఆర్బిట్రేషన్‌లో వచ్చిన తుది నిర్ణయం రెండు పక్షాలకు సమ్మతమైతే… పరస్పరం అవగాహనకు వచ్చి నిర్మాణ సంస్థ తన ఆధీనంలోని భూమిని యజమానులకు అధికారికంగా అప్పగించి గతంలో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటారు. కానీ ఇవేవీ లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు సమాచారంతో సబ్ రిజిస్ట్రార్ డీఏజీపీఏను రద్దు చేయడంపై అధికారులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
గుట్టురట్టవడంతో హడావిడిగా దిద్దుబాటు
నిర్మాణ సంస్థ ఈ వ్యవహారంపై రిజిస్ట్రేషన్, మున్సిపల్ శాఖలోని అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో రెండువైపులా దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తాత్కాలిక నిర్మాణ అనుమతులను రద్దు చేశారు. తుది అనుమతులు ఇచ్చిన ఐదు ప్లాట్లకు సంబంధించి కూడా రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఈ నెల 26న కార్పొరేషన్ కమిషనర్ గండిపేట సబ్ రిజిస్ట్రార్‌కు లేఖ రాశారు. దీంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు విరామం ఇచ్చారు. లేకపోతే దఫదఫాలుగా సుమారు ఐదారెకాల విస్తీర్ణంలోని అక్రమ లేఅవుట్లోని 150 ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించేందుకు స్కెచ్ వేసినట్లు తెలిసింది.బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ అధికారులు అనుమతులను రద్దు చేయడంతో బిల్డ్‌నౌ నిబంధనల మేరకు వారు చెల్లించిన ఫీజుల్లో 10% మినహా మిగిలిన ఫీజు మొత్తం సదరు దరఖాస్తుదారుడి ఖాతాలోకి వెళ్లిపోయింది. ఎల్ఆర్ఎస్ లేకుండానే ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయి ప్రభుత్వ ఖజానాకు భారీ గండిపడినట్లయింది. ఈ వ్యవహారంపై ‘నమస్తే తెలంగాణ’ గండిపేట సబ్ రిజిస్ట్రార్ ఆంజనేయులును సంప్రదించగా… తాత్కాలిక భవన అనుమతుల ఉత్తర్వుల ఆధారంగానే తాను ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేసినట్లు అంగీకరించారు. ప్రస్తుతం నిర్మాణ సంస్థ వాళ్లు హైకోర్టు నుంచి స్టే ఉత్తర్వులు తీసుకురావడంతో ఆ భూముల్ని నిషేధిత జాబితాలో చేర్చినట్లు చెప్పారు.