Telangana | రంగారెడ్డి/వికారాబాద్, ఆగస్టు 26(నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లాలో మైనింగ్ లీజుదారులు నిబంధనలు అతిక్రమించి యథేచ్ఛగా తవ్వుకుంటున్నారు. సహజ వనరులను కూడా వదలడం లేదు. ప్రభుత్వానికి రాయల్టీ చెల్లింపుల్లోనూ తీవ్ర అవకతవకలు జరుగుతున్నట్టు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం చేపడుతున్న డీజీపీఎస్(డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, ఈటీఎస్(ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్) సర్వేల్లో పెద్ద ఎత్తున అక్రమాలు వెలుగుజూస్తున్నాయి. ఏకంగా అటవీశాఖ భూముల్లోనూ అక్రమ మైనింగ్ జరుగుతున్న విషయం బయటపడింది.
జిల్లాలో మైనింగ్ ఆదాయం గణనీయంగా ఉంటుండగా అక్రమాలూ అదేస్థాయిలో ఉంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా 152 వరకు క్వార్జ్, గ్రానైట్, కంకర పరిశ్రమలు ఉండగా, ఇందులో 100 మాత్రమే పనిచేస్తున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం లీజు డబ్బులను ఆయా పరిశ్రమల యజమానుల నుంచి గనులు, భూగర్భ శాఖ వసూలు చేస్తున్నది.
జిల్లాలో లీజుదారులు ఒకచోట అనుమతి తీసుకుని మరోచోట తవ్వకాలు సాగించి అక్రమాలకు పాల్పడ్డారు. మరికొందరు అనుమతి పొందిన ప్రాంతం హద్దులు దాటి తవ్వకాలు జరిపారు. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీలో భారీగా కోతపడింది. దీనికోసమే డీజీపీఎస్, ఈటీఎస్ సర్వే నిర్వహిస్తున్నారు. సర్వేలో వెల్లడైన వివరాల ప్రకారం కొందరు మైనింగ్ యజమానులకు షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు. తీవ్రత ఆధారంగా 5 నుంచి 10 రెట్లు పెనాల్టీ వేస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 22 మంది లీజుదారులకు డిమాండ్ నోటీసులను జారీ చేసినట్లు మైనింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు.
మైనింగ్ శాఖ చేపడుతున్న సర్వేలో కడ్తాల్ మండలం సాలార్‌పూర్ అటవీ ప్రాంతంలోని సర్వే నంబర్ 97లో అక్రమంగా మైనింగ్ చేస్తున్నట్టు నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు ఆ శాఖ ఉన్నతాధికారులు ఎఫ్‌డీవో, రెవెన్యూ, మైనింగ్ శాఖలతో జాయింట్ సర్వే చేయించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. సాలార్పూర్లో క్వార్ట్, ఫెల్డ్ స్పార్ మైనింగ్‌కు గనుల శాఖ అనుమతులు ఇచ్చింది. అప్పట్లో ల్యాండ్ రెవెన్యూ అధికారులు జరిపిన సర్వేలో అటవీ ప్రాంతానికి వెలుపలే మైనింగ్ ప్రాంతమని నిర్ధారించినట్టు తెలిసింది. ఈ సర్వేలో అటవీశాఖ సైతం పాలుపంచుకుంది. కానీ..తాజాగా చేపట్టిన సర్వేలో మైనింగ్ పనులు జరుగుతున్న ప్రాంతం అటవీ ప్రాంతంలో ఉన్నట్టు తేలింది.
వికారాబాద్ జిల్లా బొంరాసుపేట్ మండలం గౌరారంలోని సర్వే నంబర్ 127లోని 2 వేల ఎకరాల అటవీ భూములను 1971లో రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రతిపాదించారు. తదనంతరం అటవీ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో క్రమంగా తగ్గుతూ 180 ఎకరాలకు చేరింది. మరోవైపు రెవెన్యూ అధికారులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వకుండానే సర్వే నంబర్ 127, 82 రీ అలాట్మెంట్ ప్రక్రియ పూర్తి చేశారు. దీంతో ఈ భూములు తమవి కావని అటవీ శాఖ పేర్కొనడంతో, 180 ఎకరాల అటవీ భూములకు పట్టాలిస్తూ వచ్చారు.
ఏడాది క్రితం జిల్లా అటవీ శాఖ అధికారిగా డీవీ రెడ్డి పనిచేసిన సమయంలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. జిల్లా అటవీశాఖ అధికారిగా వచ్చిన జ్ఞానేశ్వర్ గౌరారంలోని అటవీ భూములపై ఆరా తీసి సంబంధిత భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ సుమారు ఐదెకరాల్లో అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు ఏడాది క్రితం వెలుగులోకి వచ్చింది. గత అటవీ శాఖ అధికారి అక్రమ మైనింగ్‌ను మూసివేయించారు. ఇవి పట్టా భూములంటూ మైనింగ్ నిర్వాహకులు కోర్టుకెళ్లడంతో గౌరారం అటవీ భూములకు సంబంధించిన ఫైళ్లను పరిశీలించగా అసలు విషయం బయటపడింది.
గౌరారం అటవీ భూములను కాపాడుకుంటాం. సరైన ఆధారాలతో కోర్టుకెళ్తాం. సర్వే నిర్వహించి రెవెన్యూ-అటవీ హద్దులను గుర్తించాలని సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీకి లెటర్ రాశాం. గౌరారం అటవీ భూముల్లో ఎలాంటి మైనింగ్ తవ్వకాలకు అనుమతులు ఇవ్వొద్దని జిల్లా మైనింగ్ అధికారులను ఆదేశించాం.
-జ్ఞానేశ్వర్, జిల్లా అటవీ శాఖ అధికారి