(స్పెషల్ టాస్క్బ్యూరో) హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): అక్కడ చట్టాలు ఉండవు.. నిబంధనలు వర్తించవు.. అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడరు.. పోలీసులైతే అది తమ పరిధి కానట్టుగానే వ్యవహరిస్తారు. అందుకే అక్కడ అంతా ప్రైవేటు సైన్యందే రాజ్యం! అర్ధరాత్రి తుపాకులు పట్టుకొని వీరంగం చేస్తారు. ఇతరులకు చెందిన సెక్యూరిటీ గార్డులను కాల్చి పడేస్తామంటూ బెదిరిస్తారు.. దాడి చేస్తారు.. పొట్టకూటి కోసం ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన సెక్యూరిటీ గార్డులు ఈ దౌర్జన్యంతో రాష్ట్రం విడిచి పారిపోయారు.. పోలీసులు మాత్రం దెబ్బలు తిన్నోళ్లు వచ్చి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామంటారు. చివరకు ఆ సెక్యూరిటీ గార్డులను నియమించుకున్న ఉద్యోగ సంఘాలు సైతం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసేందుకు జంకుతాయి.
ఇదేదో నాగరికతలేని అటవీ ప్రాంతంలో, అందునా పోలీసులు చేరలేని మారుమూల పల్లెనో కాదు! నాడు ఉమ్మడి రాష్ర్టానికి, నేడు తెలంగాణ రాష్ర్టానికి రాజధానిగా విరాజిల్లుతున్న విశ్వనగరమైన హైదరాబాద్ మహా నగర పరిధిలోనే!! పైగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మొదలు కిందిస్థాయి సిబ్బంది వరకు అక్కడ ఏం జరుగుతుందో తెలుసు. కానీ ఎవరూ నోరు విప్పరు. సర్కారు పెద్దల కనుసన్నల్లో ప్రైవేటు సైన్యం యథేచ్ఛగా కంచెలు ఏర్పాటు చేసుకుంటుంది. వంద ఫీట్లు.. నలభై ఫీట్ల రోడ్లు నిర్మిస్తున్నారు. భారీ లేఅవుట్ కోసం రేయింబవళ్లు పనిచేస్తున్నారు. ఇంతకుమించి కాగితాలపై రంగురంగులుగా ముద్రించిన లేఅవుట్‌తో ప్లాట్లు కూడా విక్రయిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూ భారతి ఆన్లైన్ పోర్టల్‌లో అధికారికంగా వారి పేర్లు నమోదు కాలేదు. ఆ భూములకు సంబంధించి ఇప్పటివరకు పాసు పుస్తకాలు కూడా ఇవ్వలేదు. వెంచర్ కోసం నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసిందీ లేదు. ఫీజులు చెల్లించినది అంతకంటే లేదు. అయినా ఆ అక్రమ లేఅవుట్‌ను అడ్డుకునే దిక్కులేదు. పేదోడు సర్కారు భూమిలో గజం జరిగితే బుల్డోజర్లతో విరుచుకుపడే హైడ్రా, ఇతర శాఖలు ఇక్కడికొచ్చి ‘మీకు పత్రాలున్నాయా? పాసు పుస్తకాలున్నాయా?’ అని ప్రశ్నించారు. ఇదెక్కడి అన్యాయం అని కడుపుమండిన సామాన్యుడు ప్రశ్నిద్దామనుకుంటే చీమను సైతం లోపలికి రానీయకుండా మోహరించిన బౌన్సర్లు కిలోమీటరు దూరంలోనే అడ్డుకుంటున్నారు.
ఇదీ.. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లి భూముల్లో జరుగుతున్న దౌర్జన్యకాండ. సుప్రీంకోర్టు ఉత్తర్వులను సాకుగా చూపి ప్రభుత్వ పెద్దలు కొందరు ఏకంగా 91 ఎకరాల ప్రభుత్వ భూమికి స్కెచ్ వేసిన భూ దందాలో ఒక్కొక్కటిగా వివరాలు బయటికొస్తున్నాయి. రెండు నెలల కిందటే గుట్టుగా అన్నిరకాల ఉత్తర్వులు జారీచేసిన అధికారులు వాటిని మాత్రం బయటికి రానీయడం లేదు. కనీసం నేటికీ భూ భారతి ఆన్లైన్ పోర్టల్‌లో నమోదు చేయకుండా, పాసు పుస్తకాలు జారీ చేయకుండానే ప్రైవేటు వ్యక్తులు లేఅవుట్‌ను రూపొందిస్తున్నారు. కొన్నిరోజులుగా గోపన్‌పల్లి సర్వే నంబరు 36లో భారీ యంత్రాలతో రోడ్లు నిర్మిస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగుల ఇండ్ల స్థలాల కోసం వేసిన శిలా ఫలకాన్ని కూడా ధ్వంసం చేసి గోపన్‌పల్లి-విప్రో జంక్షన్‌కు వెళ్లే ప్రధాన రహదారి నుంచి లేఅవుట్లోకి వంద ఫీట్ల రహదారిని ఏర్పాటు చేశారు. మరోవైపు మార్కెట్లో లేఅవుట్‌ను చూపి జోరుగా ప్లాట్లు కూడా విక్రయిస్తున్నారు. అసలు ప్రభుత్వ భూమిలో దర్జాగా లేఅవుట్‌ను చేయడం ఒక ఎత్తయితే.. అసలు ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా, జీహెచ్ఎంసీ నుంచి లేఅవుట్ అనుమతి తీసుకోకుండా ఏకంగా ప్లాట్ల విక్రయాలు జరుపుతున్నారంటే అసలు ప్రభుత్వ, అధికార యంత్రాంగం ఉన్నట్లా? లేనట్లా? అనే విమర్శలు వినిపిస్తున్నాయి.
గోపన్‌పల్లి సర్వే నంబరు 36, 37ల్లో దాదాపు 884.24 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని అధికారుల నివేదికలోనే ఉంది. డీ నర్సింగరావు, ఇతరులు 91 ఎకరాల భూమి తమ పేర్లపై వస్తుందంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అది ఇచ్చిన ఉత్తర్వుల్లో నర్సింగరావు, ఇతరుల అభ్యర్థనను పరిశీలించాలని.. లేనిపక్షంలో ప్రభుత్వం సరైన వేదిక (కోర్టులు) ద్వారా అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చని సూచించింది. ప్రైవేటు వ్యక్తులు తమదిగా క్లెయి మ్ చేస్తున్న యాజమాన్య హక్కుల్ని ప్రభుత్వం కోర్టుకు వెళ్లి సివిల్ సూట్ ద్వారా చాలెంజ్ చేసి ప్రభుత్వానివిగా హక్కులు పొందే స్వేచ్ఛ ఉందని తన ఉత్తర్వుల్లో పొందుపరిచింది.
కేసీఆర్ ప్రభుత్వం ఈ ఉత్తర్వులను పరిశీలించి ప్రైవేటు వ్యక్తుల భూమి ఎక్కడుందో చూడాలని అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చింది. ఆ మేరకు రాజేంద్రనగర్ ఆర్డీవో నివేదిక ప్రకారం కలెక్టర్ 2021లోనే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. రెండు సర్వే నంబర్లలో ఖాళీగా ఉన్న 189.11 ఎకరాల (భాగ్యనగర్ టీఎన్జీవోకు ఇచ్చిన భూములు) భూముల రికార్డులు, క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఇందులో ప్రైవేటు వ్యక్తులకు భూమి లేదని తేల్చింది. అంటే ప్రైవేటు వ్యక్తులు క్లెయిమ్ చేస్తున్న భూములు న్యాయం అనుకున్నప్పటికీ అవి ఈ భూములు కావని అప్పట్లోనే అధికారులు సర్వే ల ద్వారా స్పష్టంచేశారు. ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులపరం కాకుండా కాపాడింది.
ప్రభుత్వం మారితే కలెక్టర్ల నివేదికలు మారతాయా? భూములు తారుమారవుతాయా? ఇలాగైతే అసలు ప్రభుత్వాల నిర్ణయాలు, అధికారుల నివేదికలకు అర్థమేముంటుందని సీనియర్ అధికారులు వాపోతున్నారు. సదరు ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కయిన కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు కొందరు 91 ఎకరాల భూమిని కొల్లగొట్టేందుకు గతంలోని అధికారుల నివేదికలను బుట్టదాఖలు చేశారు. వాస్తవానికి ప్రైవేటు వ్యక్తులు క్లెయిమ్ చేస్తున్న భూములు ఇతరచోట ఉంటే సుప్రీం ఉత్తర్వుల ప్రకారం వారికి ఇవ్వాలి. లేకపోతే న్యాయపోరాటం చేసి రూ.9 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్ని కాపాడాలి. ప్రైవేటు వ్యక్తులు కోర్టు ధిక్కరణకు వెళితే సవాల్‌గా ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసి ఆ భూముల్ని కాపాడుకోవాలి. కానీ ఇక్కడ రక్షకులే భక్షకులయ్యారు.
గతంలోనే సదరు ప్రైవేటు వ్యక్తులతో ప్రభుత్వంలోని పెద్దలు కొందరు ఒప్పందాలు చేసుకోవడం, కీలక మంత్రి ఒకరు వందల కోట్ల డీల్ కుదుర్చుకోవడంతో సర్వే నంబరు 36లో నలుగురి పేరిట 45 ఎకరాలు, సర్వే నంబరు 37లో 10 మంది పేరిట 46 ఎకరాలు పట్టా భూమిగా నమోదైందని గత నివేదికలు, సర్వేలకు విరుద్ధంగా అధికారులు నివేదిక రూపొందించారు. దానికి అనుగుణంగా గతంలో ఉద్యోగులకు ఇచ్చిన భూముల్లోనే ప్రైవేటు వ్యక్తుల భూములు ఉన్నాయంటూ రాజేంద్రనగర్ ఆర్డీవో నివేదిక మేరకు ప్రస్తుత రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి నివేదికలు రూపొందించారు. అందుకు అనుగుణంగా సీసీఎల్ఏ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అనంతరం ఎన్వోసీలు జారీచేసి, ఆ భూముల్ని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ ఐజీకి లేఖలు కూడా పంపారు.
ప్రైవేటు వ్యక్తుల పేరిట సర్కారు భూమిని ధారాదత్తం చేస్తుండటంతో అందులో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న బసవతారక్నగర్ బస్తీవాసులకు ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. ఈ మేరకు సర్వే నంబరు 37/రు, 37/లుల్లోని ఎనిమిది ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని రంగారెడ్డి కలెక్టర్ రిజిస్ట్రేషన్ శాఖకు గత నెల 11వ తేదీన లేఖ (ఇ1/208/2025) కూడా పంపారు.
రెవెన్యూ రికార్డుల్లో తోలి మహదేవ్ పేరు ఉండగా ఆయన మరణానంతరం వారసుడు తోలి సిద్దోబా పేరు వచ్చిందని, ఆయన మరణించిన తర్వాత సిద్దోబా భార్యలు ఇద్దరు 1984లో ఆమంచర్ల నర్సింహారావు కొనుగోలు చేశారని, ఇప్పుడు ఆయన వారసుడు మల్లికార్జునరావు దరఖాస్తు మేరకు భూమిని ఆయనకు అప్పగిస్తున్నట్టుగా అందులో పేర్కొన్నారు. అందుకే బసవతారకనగర్ నిరుపేదలకు మద్దతుగా విపక్షాలు, ఇతరులు నిలవకుండా ఉండేందుకు రాజేంద్రనగర్ ఆర్డీవో ఆ భూమిని తన ఆధీనంలోకి తీసుకుంటున్నానని బోర్డు ఏర్పాటు చేశారు. అదేవిధంగా దశాబ్దాలుగా ఇండ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న భాగ్యనగర్ టీఎన్జీవోలు ఆశిస్తున్న సర్వే నంబరు 36లో కూడా ప్రైవేటు వ్యక్తులు పాగా వేసి ఏకంగా లేఅవుట్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
భాగ్యనగర్ టీఎన్జీవోలు ఏండ్ల తరబడిగా భూముల పరిరక్షణకు సెక్యూరిటీ గార్డులను నియమించారు. ఈ నెల 11న ఆ భూమిలో కంటెయినర్లు వేసిన ప్రైవేటు వ్యక్తులు అదేరోజు అర్ధరాత్రి 2 గంటలకు సెక్యూరిటీ గార్డు సుదీప్గుప్తా, అతడి తమ్ముడిని రివాల్వర్లు చూపి బెదిరించడంతో తెల్లారేసరికి ఎవరికీ చెప్పకుండానే ఇద్దరు భయంతో ముంబై వెళ్లిపోయారు. తెల్లారి ఈ విషయం తెలుసుకున్న ఉద్యోగ సంఘాల నేతలు సైబరాబాద్ సీపీ, మాదాపూర్ డీసీపీకి విషయం చెప్తే సుదీప్గుప్తాతో ఫిర్యాదు చేయిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పినట్టు తెలిసింది.