గద్వాల టౌన్, ఫిబ్రవరి 17 : జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బసవన్న చౌరస్తా వద్ద నిర్మించిన దుకాణ సముదాయాన్ని మున్సిపల్ అధికారులు సోమవారం నేలమట్టం చేశారు. ప్రజాప్రయోజనాల కోసం ఉపయోగించాల్సిన పది శాతం స్థలంలో కొందరు అక్రమంగా దుకాణాలను నిర్మించగా.. మున్సిపల్ అధికారుల ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కట్టడాలను కూల్చివేశారు. ప్రభుత్వ స్థలాల్లో, పది శాతం స్థలాలో అక్రమ నిర్మాణాలు చేపట్టినా.. డబ్బాలు ఏర్పాటు చేసినా చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ దశరథ్ హెచ్చరించారు. నోటీసులు, సమాచారం లేకుండానే కూల్చివేస్తామన్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తేతెలంగాణ) : తెలంగాణ అభివృద్ధి ప్రణాళిక సంఘం (టీజీడీపీఎస్) సలహా కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ చైర్మన్గా ఉప ముఖ్యమంత్రి, ప్రణాళికశాఖ మంత్రిగా వ్యవహరిస్తారు. కమిటీ సభ్యులుగా ప్రొఫెసర్లు కంచె ఐలయ్య, శాంతిసిన్హా, హిమాన్షు, భూక్యా, పురుషోత్తంరెడ్డి, డాక్టర్ సుఖదేవ్ థారోట్, నిఖిల్ దేవ్, ప్రవీణ్ చక్రవర్తిలను నియమించారు. ఈ సలహా సంఘం రాష్ట్ర ఆర్థిక, సామాజిక, వివిధ రంగాలలో సలహాలు, సూచనలు అందించనుంది.