మహబూబ్‌నగర్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తమ్ముడు శ్రీకాంత్‌గౌడ్‌ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. మహబూబ్‌నగర్ రూరల్ సీఐ గాంధీనాయక్ ఆధ్వర్యంలో పోలీసులు హైదరాబాద్‌కు వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేసినట్టు తెలుస్తున్నది. వివరాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది ఆగస్టు 29 తెల్లవారుజామున మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్‌పల్లిలో 75 ఇండ్లను బుల్డోజర్లతో కూల్చివేశారు. దివ్యాంగులతోపాటు పేదల ఇండ్లు కూలిపోవడంతో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో పోలీసులు కాంగ్రెస్ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి అక్రమంగా కేసులు నమోదు చేశారు. అందులో భాగంగానే శ్రీకాంత్‌గౌడ్‌పై కూడా అక్రమంగా కేసు నమోదు చేశారు. దీంతో శుక్రవారం సాయంత్రం శ్రీకాంత్‌గౌడ్ రూరల్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. విచారించి కోర్టులో హాజరు పరుస్తామని సీఐ గాంధీనాయక్ వెల్లడించారు.
ఎమ్మెల్సీ ఓటు హక్కు కల్పించండి : ఎస్జీటీయూ
హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు టీచర్ ఎమ్మెల్సీ ఓటుహక్కు కల్పించాలని సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్(ఎస్జీటీయూ) కోరింది. యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కరివేద మహిపాల్‌రెడ్డి, ఏ వెంకటేశం, పెన్షనర్స్ సంఘం నేత పులి సరోత్తంరెడ్డి శుక్రవారం ఢిల్లీలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్, కేంద్ర ఎన్నికల సంఘం సహాయ అధికారి హిర్దిశ్కుమార్ను కలిసి వినతిపత్రాలు అందజేశారు.