సంగారెడ్డి, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): యువత దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శించి దేశ సంస్కృతి సంప్రదాయాలు, సాంకేతిక ఆవిష్కరణలను చూసేందుకు యువసంగం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి తెలిపారు. ఐఐటీ హైదరాబాద్, బనారస్ హిందూ యూనివర్సిటీ సంయుక్తంగా మూడో విడత యువసంగం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. తెలంగాణకు నోడల్ సెంటర్‌గా ఐఐటీ హైదరాబాద్ వ్యవహరిస్తున్నట్టు తెలిపారు.
పర్యాటకం, దేశంలోని సంప్రదాయాలు, దేశ అభివృద్ధి, ప్రజలతో అనుసంధానం, సాంకేతిక అంశాలపై యువతలో ఆసక్తి పెంచేందుకు యువసంగం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, 18 నుంచి 30 ఏండ్లలోపు వయస్సుగల విద్యార్థులు ఈ కార్యక్రమంలో చేరవచ్చని సూచించారు.
ఇందులో చేరిన విద్యార్థులను దేశంలోని విభిన్న పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్తామని తెలిపారు. యువసంగం కార్యక్రమంలో పాల్గొనాలనుకునే విద్యార్థులు ఈనెల 28లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. http://ebsb. aicte-india.org వెబ్సైట్ ద్వారా విద్యార్థులు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.