సంగారెడ్డి, అక్టోబర్ 22(నమస్తే తెలంగాణ): దేశ రక్షణ రంగ అవసరాలు తీర్చేందుకు భారత రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్డీవో), ఐఐటీ హైదరాబాద్ కలిసి పనిచేయనున్నాయి. ఇందుకోసం ఐఐటీ హైదరాబాద్‌లో డీఆర్డీవో ఇండస్ట్రియల్ అకడేమియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 18 నుంచి 22 వరకు గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన డిఫెన్స్ ఎక్స్పో-2022లో ఇందుకు సంబంధించి అవగాహన ఒప్పంద పత్రాలపై డీఆర్డీవో చైర్మన్ సమీర్ వీ కామత్, ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి సంతకాలు చేశారు.
రక్షణ రంగానికి సంబంధించిన ఏడు రంగాల్లో కలిసి పనిచేస్తారు. ఇందుకు దేశంలోని పరిశ్రమలు, సాంకేతిక కేంద్రాలు, స్టార్టప్ కంపెనీలను డీఆర్డీవో ఇండస్ట్రియల్ అకడేమియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో భాగస్వామ్యులను చేయనున్నారు. రక్షణ రంగానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు డీఆర్డీవో సెల్ ద్వారా ఐఐటీహెచ్ పనిచేయనున్నది. రాబోయే రోజుల్లో హైపర్ సోనిక్ వాహనాల తయారీకి అవసరమైన అల్ట్రా హై టెంపరేచర్ మెటీరియల్స్‌ను అభివృద్ధి చేస్తారు. క్షిపణుల కోసం అవసరమైన కృత్రిమ మేధస్సు, స్పేస్ అప్లికేషన్ కోసం నూతన సాంకేతికతను అభివృద్ధి చేస్తారు. అడాప్టివ్ ఇమేజింగ్, ఇమేజ్ ప్రాసెసింగ్, నానో ఆర్నిథాప్టర్ టెక్నాలజీ, సీకర్, హోమింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తారు. కాగా, సాంకేతిక రంగంలో నూతన ఆవిష్కరణల ద్వారా మానవాళికి సేవ చేసేందుకు ఐఐటీ హైదరాబాద్ కట్టుబడి ఉందని ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి పేర్కొన్నారు.