సంగారెడ్డి, జనవరి 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని యూనివర్సిటీల్లో ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నారని, వారిని శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఐఐటీ హైదరాబాద్ ఆయా వర్సిటీలతో కలిసి పనిచేయాలని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కార్యదర్శి శ్రీవారి చంద్రశేఖర్ సూచించారు. శనివారం సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్‌లో మొదటిసారి నిర్వహించిన ఇన్నోవేషన్ డేను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాను ఇటీవలే నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీని సందర్శించానని, 200 మంది విద్యార్థులతో మాట్లాడానని చెప్పారు.
ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లపై ప్రశ్నించగా.. భూతాపం, కర్బన ఉద్గారాలు అని జవాబిచ్చారని తెలిపారు. అయితే, ఆ విద్యార్థులెవరూ 5జీ టెక్నాలజీ, ఇతర సాంకేతిక అంశాల గురించి జవాబివ్వలేదని వివరించారు. ఎంతో ప్రతిభ ఉన్న ఆ విద్యార్థులకు సాంకేతికంగా అండగా నిలవాల్సిన అవసరం ఉన్నదని, వారికి మార్గదర్శనం చేస్తే శాస్త్రవేత్తలుగా ఎదుగుతారని వెల్లడించారు. దీని కోసం కృషి చేయాలని ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తిని కోరారు. ఐఐటీ హైదరాబాద్ నుంచి అనేక ఆవిష్కరణలు వస్తున్నాయని చెప్పారు. కార్యక్రమంలో ఐఐటీ గవర్నింగ్ బాడీ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి, ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తి, ఫ్రాక్టల్ అనలిటిక్స్ సహ వ్యవస్థాపకుడు శ్రీకాంత్ వెలమకన్ని, ఐఐటీ ప్రొఫెసర్లు, విద్యార్థులు, పారిశ్రామిక వేత్తలు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఇన్నోవేషన్ డేలో భాగంగా 30 కొత్త ఆవిష్కరణలను ప్రదర్శించారు.
కాంబాట్ డ్రోన్
ఐఐటీ హైదరాబాద్, బిన్‌ఫోర్డ్ రిసెర్చ్ ల్యాబ్‌తో కలిసి కాంబాట్ డ్రోన్(యుద్ధ డ్రోన్)ను అభివృద్ధి చేసింది. డ్రోన్‌కు ఏకే 47 లాంటి ఆయుధాన్ని అనుసంధానం చేశారు. ఇది 360 డిగ్రీలు తిరిగుతూ, ఆగకుండా ఫైర్ చేయగలదు. ఇందుకోసం డ్రోన్‌లో స్టెబిలైజేషన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
మ్యాన్‌రైడింగ్ పవర్ వీడర్
ఐఐటీ హైదరాబాద్‌తో కలిసి షణ్ముఖరావు మోనోవీల్ మ్యాన్ రైడింగ్ పవర్ వీడర్‌ను అభివృద్ధి చేశారు. పంట దెబ్బతినకుండా కలుపు మొక్కలు తొలగించేలా దీన్ని తయారుచేశారు. మ్యాన్‌రైడింగ్ పవర్‌వీడర్ యంత్రంలో ఒకే చక్రం ఉండటం వల్ల సులువుగా పంట సాళ్ల మధ్యలో సులువుగా తిరుగుతూ, కలుపు మొక్కలను వేగంగా తొలగిస్తుంది.
త్రీడీ ప్రింటింగ్, వైర్ ఆర్క్ యాడిటివ్ మాన్యుఫ్యాక్చరింగ్
ఎలాంటి డైలు అవసరం లేకుండా లోహపు వైర్లకు పోత పోసి పరిశ్రమలకు అవసరమైన పరికరాలను తయారు చేసేదే 3డీ ప్రింటింగ్ వైర్ ఆర్క్ యాడిటివ్ మాన్యుఫ్యాక్చరింగ్. ఆర్క్ వెల్టింగ్ ద్వారా ఎలాంటి లోహాలనైనా సులువుగా జోడించేందుకు వీలుంటుంది. దీని ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతుంది.
ఎదుగుదల లోపాలను గుర్తించే ఈ-మ్యాట్రస్
రెండేండ్లలోపు పిల్లల్లో ఎదుగుదల లోపాలను గుర్తించే ఈ-మ్యాట్రస్, ప్లేయార్డును ఐఐటీ హైదరాబాద్‌తో కలిసి ఆవిష్కర్త ప్రమోద్ రూపొందించారు. ఈ మ్యాట్రస్‌పై చిన్నారులను పడుకోబెట్టడం, పే ్లయార్డులో ఆటవస్తువులతో పిల్లలు ఆడుకోవడం ద్వారా సులువుగా ఎదుగుదల సమస్యలను గుర్తించవచ్చని ఆవిష్కర్త ప్రమోద్ తెలిపారు.
యాక్టివ్ బ్రెయిన్ బ్యాండ్
మూర్చ రోగుల్లో సైలెంట్ సీజర్స్‌ను కనిపెట్టే యాక్టివ్ బ్రెయిన్ బ్యాండ్‌ను ఐఐటీ విద్యార్థులు సౌమ్య, అనికేత్ రూపొందించారు. ఈ బ్యాండ్‌లోని అధునాతన సెన్సర్లు సెలెంట్ సీజర్స్‌ను క్షణాల్లో పసిగట్టి వైద్యులను అప్రమత్తం చేస్తాయి. నిమ్స్‌లో దీని పనితీరును పరీక్షిస్తున్నారు.
సీ-కాలర్ టెస్ట్ కిట్
మహిళల్లో వచ్చే సర్వైకల్ క్యాన్సర్‌ను సులువుగా గుర్తించేందుకు ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు డాక్టర్ అరుణ్‌కుమార్, డాక్టర్ తేజస్విని అప్పిడి సీ-కాలర్ డిటెక్టివ్ కిట్‌ను అభివృద్ధి చేశారు. గోల్డెన్ నానో పార్టికల్స్, అస్కారబిక్ యాసిడ్ కలిపి సీ-కాలర్ ప్లూయిడ్ టెస్ట్ ట్యూబ్‌ను తయారు చేశారు. మహిళ గర్భాశయ ద్రవాలను సీ-కాలర్ టెస్ట్ ట్యూబ్‌లో వేయాలి. ఆ రసాయన మిశ్రమం తెలుపు రంగులోకి మారితే సర్వైకల్ క్యాన్సర్ ఉన్నట్టు అర్థం.