న్యూఢిల్లీ/హైదరాబాద్/సంగారెడ్డి, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): దేశంలో అత్యున్నత విద్యాసంస్థలకు కేంద్ర ప్రభుత్వం 2021 ఏడాదికిగాను ప్రకటించిన అటల్ ఇన్నోవేషన్ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ హైదరాబాద్ టాప్‌టెన్‌లో నిలిచింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ సుభాష్ సర్కార్ బుధవారం ఈ ర్యాంకులను ప్రకటించారు. వినూత్న సాంకేతిక ఆవిష్కరణల అంశంలో ఐఐటీ మద్రాస్ నంబర్‌వన్‌గా నిలిచింది. వరుసగా మూడో ఏడాది కూడా మొదటిస్థానం దక్కించుకొన్నది. ఆ తర్వాతి స్థానాల్లో ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ రూర్కీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ), ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ ఖరగ్‌పూర్ నిలిచాయి. సంగారెడ్డి జిల్లా కందిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీహెచ్) ఏడో స్థానం దక్కించుకున్నది. ఐఐటీ హైదరాబాద్ టాప్‌టెన్‌లో చోటు దక్కించుకోవడం ఇది రెండోసారి. దేశంలోని వర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థల్లోని అధ్యాపకులు, విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి, వారిని ప్రోత్సహించేందుకు కేంద్ర విద్యాశాఖ 2018లో ఏఆర్ఐఐఏ పేరుతో కొత్త వ్యవస్థను ఏర్పాటుచేసింది. అప్పటి నుంచి ఏటా ర్యాంకులను ప్రకటిస్తున్నది. 2019లో తొలిసారిగా ఐఐటీహెచ్ 10వ స్థానంలో, గతేడాది 19వ స్థానంలో, ఇప్పుడు 7వ స్థానంలో నిలువడం గర్వకారణం. విద్యార్థులు, సిబ్బంది, అధ్యాపకులు, ముఖ్యంగా పూర్వవిద్యార్థుల దార్శనికత.. ఇలా సమష్టి కృషి వల్లనే ఈ ఫలితాన్ని సాధించామని ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి హర్షం ప్రకటించారు. ర్యాంకును ప్రకటించిన కేంద్ర విద్యాశాఖకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.