హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగా ణ) : రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం నడుంబిగించింది. ఆయా ఆలయాల వారీగా భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కల్పించాల్సిన సౌకర్యాలపై సమగ్ర అ ధ్యయనం చేసి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా అహ్మదాబాద్‌కు చెందిన ఐ ఐఎం పట్టభద్రులు అధ్యయనం చేపట్టారు. ఆలయాల్లో భక్తుల అవసరాలను, ఎదుర్కొంటున్న సమస్యలపై ఇప్పటికే పైలెట్ ప్రాజక్టు కింద వేములవాడ ఆలయాన్ని పట్టభద్రులు సందర్శించారు.
వివిధ అంశాలపై అధ్యయనం చేసి, వారు ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారు. భద్రాచలం, బాసర, యాదాద్రి తదితర ప్రధాన ఆలయాల్లో కూడా అధ్యయనం చేపట్టి అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి ప్రతిపాదనలు చేయనున్నారు. వీరిచ్చే నివేదిక ప్రకారం ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదిలావుండగా, పేద బ్రాహ్మణ విద్యార్థులక సంబంధించిన వివేకానంద విదేశీ విద్యా పథకం పెండింగ్ దరఖాస్తులను ఎన్నికల కోడ్ పూర్తికాగానే పరిష్కరించాలని అధికారులు నిర్ణయించారు. సుమారు 500 మంది అభ్యర్థులకు ఆర్థిక సాయం మంజూరు చేయాల్సి ఉన్నదని పేర్కొన్నారు.