హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో తాత్కాలికంగా కొనసాగుతున్న కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ(ఐఐహెచ్టీ)ని యాదాద్రి జిల్లా పోచంపల్లికి తరలించాలని అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు. హ్యాండ్లూమ్ టెక్నాలజీ పోచంపల్లి నుంచే శాశ్వతంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని, తరలింపు ప్రక్రియను ఏడాదిలోగా పూర్తి చేయాలని సూచించారు.
స్వయం సహాయక సంఘాల మహిళలకు అందచేసే మహిళశక్తి చీరల ఉత్పత్తిని వేగవంతం చేయాలని కోరారు. చేనేత పథకాలపై గురువారం సచివాలయంలో మంత్రి సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ నేత కార్మికులకు అమసరమైన నూలును అందుబాటులో ఉంచాలని, ఇందుకు వేములవాడ నూలు డిపోను సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఆదేశించారు. నష్టాల్లో ఉన్న టెసో షోరూంలను లాభాల్లో ఉన్న షోరూంలలో విలీనం చేయాలని ఆదేశించారు.