KTR | హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కే తారకరామారావును సుదీర్ఘకాలం జైలులో నిర్బంధించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తున్నట్టు కనిపిస్తున్నది. జరుగుతున్న పరిణామాలు ఇవే సంకేతాలను ఇస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అర్వింద్ దా కా పన్నుతున్న వ్యూహాలు, వేస్తున్న ఎత్తులు, వస్తున్న లీకులు వెరసి కేటీఆర్‌ను దీర్ఘకాలం ప్రజల నుంచి దూరం చేయాలన్న పట్టుదలను స్పష్టం చేస్తున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి సర్కార్ ఏర్పడినప్పటి నుంచి కేటీఆర్ ప్రతి అంశంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేసీఆర్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు రేవంత్‌రెడ్డి సర్కార్ శ్వేతపత్రం విడుదల చేస్తే బీఆర్ఎస్ స్వేదపత్రం విడుదల చేయటం మొదలు మూసీ, హైడ్రా దాకా, సుంకిశాల నుంచి కొ డంగల్ లిఫ్ట్ ఇరిగేషన్, అమృత్ స్కీమ్ దాకా ప్రతి అంశంలో కేటీఆర్.. బీఆర్ఎస్ శ్రేణులను నడిపిస్తున్న తీరు, ప్రజలు పార్టీ వైపు ర్యాలీ అవుతున్న వైనంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసహనంగా ఉన్నట్టు తెలుస్తున్నది. దీనికి బలమైన అడ్డుకట్ట వేసేందుకు రేవంత్‌రెడ్డి భారీ కసరత్తు చేస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాల్లోనే చర్చ నడుస్తున్నది. అందులో భాగంగానే కేటీఆర్‌ను సుదీర్ఘకాలం నిర్బంధంలో ఉంచే వ్యూహానికి తెరలేపినట్టు తెలుస్తున్నది. పద్ధతి ప్రకారం ముందుగా ఒక్కొక్క అంశాన్ని లేవనెత్తుతూ ఆయనపై ఆరోపణలు చేయడం.. అవి నిజమేనని అనుకూల మీడియాతో చెప్పించడం, వాటికి సం బంధించిన నివేదికలు తమ వద్ద ఉన్నాయంటూ ప్రభుత్వ పెద్దలు వ్యాఖ్యానించడం అందులో భాగమేనని పరిశీలకులు పేర్కొంటున్నారు.
అంతా వ్యూహాత్మకమే
కనీసం అరడజనుకుపైగా అంశాల్లో కేటీఆర్ పేరును ప్రస్తావించడం, దాంట్లో ఏదో జరిగిందని, దానికి ఆయనే బాధ్యుడంటూ ఆరోపణలు చేస్తున్నారని, ఇదంతా వ్యూహాత్మకంగా జరుగుతున్నదేనని విశ్లేషకులు చెప్తున్నారు. ఫోన్‌ట్యాపింగ్, ఫార్ములా ఈ-రేస్, ధరణిలో అక్రమాలు, ఔటర్‌రింగ్‌రోడ్ టెండ ర్లు.. ఇలా అనేక అంశాల్లో అవినీతి ఆరోపణలు చేస్తూ.. కేటీఆర్ సహా బీఆర్ఎస్ మూ ల్యం చెల్లించుకోక తప్పదని సర్కార్ పెద్దలు వ్యాఖ్యానిస్తున్నారు. వాటికి కొనసాగింపుగా త్వరలో పొలిటికల్ బాంబు పేలుబోతున్నదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సియోల్ వేదికగా చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ కుట్రకు మరింత ఊతమిస్తున్నాయి. పొంగులేటి వ్యా ఖ్యల అనంతరమే ఫార్ములా ఈ-రేస్ తెరపైకి వచ్చింది. ఆ వెంటనే ఏసీబీ రంగంలోకి దిగటం, కేటీఆర్‌ను విచారించేందుకు గవర్నర్ అనుమతి కోసం లేఖ రాయటం శరవేగంగా జరిగిపోయాయి. ఇంతలో లగచర్ల ఘటన ప్రభుత్వానికి చేతికందిన అస్త్రంలా దొరికింది. లగచర్ల ఘటనలో బీఆర్ఎస్కు చెందిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని అరెస్టుచేసిన ప్రభుత్వం పనిలోపనిగా ఆయన రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరును చేర్చింది. లగచర్ల ఘటనలో కేసీఆర్ హస్తం ఉన్నదంటూ ఆరోపించింది. దీనిని అడ్డంపెట్టుకొని ‘కేటీఆర్‌ను ఎప్పుడైనా అరెస్టు చేయవచ్చు’ అంటూ ప్రభుత్వ పెద్దల నుంచి లీకుల వెల్లువ మొదలైంది. అయితే, ఫార్ములా ఈ-రేస్‌లో అసలేం జరిగిందో కేటీఆర్ ఖుల్లంఖు ల్లా బయటపెట్టిన సంగతి తెలిసిందే.
అదనుచూసి అరెస్టు?
ప్రభుత్వపెద్దలు చేస్తున్న వ్యాఖ్యలు, అనుసరిస్తున్న వైఖరి వెనుక పకడ్బందీ వ్యూహం ఉన్నదని విశ్లేషకులు భావిస్తున్నారు కేటీఆర్‌ను ఏ క్షణంలోనైనా అరెస్టు చేయవచ్చని లీకులు ఇచ్చి.. అనంతర పరిణామాలు తీవ్రరూపం దాల్చకుండా చూడాలన్నదే ప్రభుత్వం వ్యూ హంగా కనిపిస్తున్నదని అంటున్నారు. అం దులో భాగంగానే సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవలి ఢిల్లీలో గవర్నర్ అనుమతి రాగా నే కేటీఆర్‌పై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. లగచర్ల ఘటనలో ఎవరు ఉన్నా వదిలేది లేదని సీఎం పేర్కొనడం, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు కేటీఆర్ అరెస్టు కోసం రంగం సిద్ధం చేసినట్టు స్పష్టమవుతున్నదని అంటున్నారు. ‘శిక్ష తప్పదు కేటీఆర్. నువు ఫేస్ చేయాల్సిందే. అంటూ ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, వేముల వీరేశం వంటివాళ్లు కూడా కేటీఆర్‌పై ఆరోపణలు చేశారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డి చేసిన అనేక ఆరోపణలను ఇప్పుడు తవ్వుతున్నట్టు తెలిసింది. పోలీసుల విచారణలో ఏవీ తేలకపోవడంతో నరేందర్‌రెడ్డి రిమాండు రిపోర్టులోనైనా కేటీఆర్ పేరుండేలా పోలీసులపై ఒత్తిడి చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దీర్ఘకాలం జైలులో ఉంచాలన్నదే ప్లాన్
కేటీఆర్‌ను కనీసం ఆరు నెలల నుంచి ఏడాదైనా జైలులో ఉంచాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ఎత్తుగడగా కనిపిస్తున్నది. కాంగ్రెస్ ఒక్కటే కేటీఆర్ గురించి మాట్లాడితే కక్షసాధింపు అన్న ప్రచారం జరుగుతుందని, బీజేపీతో కూడా మాట్లాడించాలని రేవంత్‌రెడ్డి బృందం భావిస్తున్నది. ఇటీవల కేంద్ర మంత్రి బండి సంజయ్ కేటీఆర్‌పై విరుచుకుపడుతున్నారు. రేవంత్‌కు వంతపాడేందుకు తాజాగా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కూడా చేరారు. అర్వింద్ వ్యాఖ్యలు కేటీఆర్ అరెస్టు తప్పదనే వాతావరణాన్ని రూఢీ చేస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఒక్కో అంశంలో ఒక్కో కేసు నమోదుచేస్తూ.. ఒక కేసులో బెయిల్‌పై బయటకొస్తే మరో కేసులో జైలుకు పంపేలా చూడాలని భావిస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగానే సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పొంగులేటి, కోమటిరెడ్డి, ఎమ్మెల్యే వీరేశం వంటి వారు కేటీఆర్‌పై వేర్వేరు అంశాల్లో ఆరోపణలకు దిగుతున్నారు.