Peddapalli | హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ) :పాలిసెట్ ఫలితాలు విడుదల చేశారని తెలుసుకొని..వెబ్సైట్ ద్వారా రిజల్ట్ చూడగానే ఖాళీ ర్యాంకుకార్డు దర్శనమిచ్చింది. దీంతో ఆ విద్యార్థి బిత్తరపోయాడు. పెద్దపల్లి జిల్లా కొలనూరుకు చెందిన విద్యార్థి మే 24న పాలిసెట్‌కు హాజరయ్యాడు. అధికారులు అతడికి 3111158 హాల్‌టికెట్ నంబర్ కేటాయించారు. ఆయా విద్యార్థి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లోని శ్రీచైతన్య ఇంజినీరింగ్ కాలేజీ పరీక్షాకేంద్రంలో పరీక్షకు హాజరయ్యాడు.
ఫలితాలొస్తాయి.. ఏదో కాలేజీలో సీటు వస్తుందన్న నమ్మకంతో ఫలితాలను పరిశీలిస్తే ఖాళీ ర్యాంకుకార్డుయే దర్శనమిచ్చింది. ఇదే విషయంపై ఉన్నతాధికారులను సంప్రదించినా ఫలితం లేదు. విద్యార్థి ఓఎమ్మార్ షీట్ గల్లంతయ్యిదా.. లేక ఏదైనా సాంకేతిక తప్పిదం జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు న్యాయం చేయాలని ఆ విద్యార్థి కోరుతున్నాడు.