పోచమ్మమైదాన్, జూన్ 19 : ‘ఇజ్జత్ ఉంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలి’ అని కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ సవాల్ విసిరారు. రాహుల్‌గాంధీ జన్మదినం సందర్భంగా వరంగల్ పోచమ్మమైదాన్‌లో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొండా మురళీ మాట్లాడారు. సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశానని చెప్పుకొని తిరిగిన నాయకులు గతంలో వారు పనిచేసిన పార్టీలను భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. ‘నిన్న.. కేసీఆర్ మంత్రి పదవి ఇస్తే బీఆర్ఎస్ పార్టీని భ్రష్టుపట్టించారు. అంతకుముందు చంద్రబాబును భ్రష్టుపట్టించి.. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరి పార్టీని ఆగం చేస్తున్న నాయకుల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నా’ అంటూ ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి సూచించారు.
ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి కడియం శ్రీహరి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిపై పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం మంత్రి పదవి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. వారి చర్యలతో పార్టీకి, ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని ఉద్దేశించి ‘పరకాలలో దరిద్రమైన నాయకుడు.. 75 ఏండ్ల ముసలోడు వచ్చిండు. ఆనాడు నా రెండు కాళ్లు పట్టుకుండు. నన్ను ఒక్కసారి గెలిపించమని బతిలాడితే ఎమ్మెల్యేను చేసినం’ అని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పరకాలలో తన కూతురు సుష్మిత ఎమ్మెల్యే అవడం ఖా యమని పేర్కొన్నారు. తానూ ఎమ్మెల్సీ అవుతానని చెప్పారు. మంత్రి కొండా సురేఖ వ రంగల్ తూర్పులో ఉంటారని స్పష్టం చేశారు.