Driving Licence | వాహనదారుల నిర్లక్ష్యంపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించే వారిపై డ్రైవింగ్ లైసెన్స్ రద్దును ప్రయోగిస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై, ట్రాఫిక్, రవాణా నిబంధనలు ఉల్లంఘించేవారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. తొలుత జరిమానాలతో సరి పెడుతూనే, పదేపదే నిబంధనలు ఉల్లంఘించేవారి డ్రైవింగ్ లైసెన్స్‌లను రద్దు చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసుల నుంచి వచ్చే లైసెన్సుల రద్దు ప్రక్రియను వేగవంతం చేసి ఉల్లంఘనదారులను బెంబేలెత్తిస్తున్నారు.
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన కేసులను మొదటి క్యాటగిరీగా, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నవాటిని రెండో క్యాటగిరీగా వర్గీకరించి కేసులు నమోదు చేస్తున్నారు. వీటితో పాటు రోడ్డు ప్రమాదాల నివారణపై శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు చేసే ప్రక్రియపై కూడా కసరత్తు చేస్తున్నారు. కారు నంబర్‌పై స్పీడ్ లేజర్ గన్ చిత్రీకరించిన దృశ్యాలను చూస్తూ అధిక సార్లు అతివేగంతో ప్రయాణించడాన్ని ట్రాఫిక్ పోలీసులు గుర్తించి లైసెన్స్ సస్పెండ్ చేయాలని రవాణాశాఖకు పంపుతున్నారు. అంతేకాదు లైసెన్స్ రద్దులో ఉన్నప్పుడు వాహనం నడుపుతూ దొరికితే జైలు శిక్ష కూడా పడే వీలుంది. రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాహనదారుల్లో క్రమశిక్షణ పెంపొందించే కార్యక్రమాలు సైతం ఆర్టీఏ అధికారులు నిర్వహిస్తున్నారు.
పోలీసుల నుంచి ఉల్లంఘనదారుడి వివరాలు రవాణాశాఖకు చేరుకుంటాయి. వారు పరిశీలించి సదరు వ్యక్తికి నోటీసులు పంపిస్తారు. పది రోజుల్లో అతడు తన వివరణను ఆర్టీఏ అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం రవాణ శాఖ అధికారులు నిర్ణయం మేరకు లైసెన్స్ రద్దు ప్రక్రియ జరుగుతుంది. కోర్టు నిబంధనల ప్రకారం లైసెన్స్ రద్దు ప్రక్రియ ఉంటుంది.
కొత్తగా లైసెన్స్ పొందాలనుకునే వారికి రోడ్డు భద్రతపై ఆర్టీఏ అధికారులు పూర్తి అవగాహన కల్పిస్తున్నారు. అందుకోసం నిబంధనలు సూచించే మూడు గంటల వీడియో వీక్షించే ఏర్పాట్లపై కసరత్తు చేస్తున్నారు. ప్రమాద రహిత ప్రయాణంపై రవాణా శాఖ అధికారులు మూడు గంటల వీడియోను రూపొందించారు. ఈ వీడియోను లైసెన్స్ దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ వీక్షించాల్సి ఉంటుంది. ప్రత్యేక రూంలో ఈ వీడియోను ప్రదర్శిస్తారు. ప్రమాదాలపై అవగాహన కల్పించే వీడియోను వీక్షించిన అనంతరం లైసెన్స్ ప్రక్రియ జరుగుతుంది. ఈ మేరకు ఆర్టీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
రాష్ట్రమంతా అమలు చేయడంలో భాగంగా ముందుగా పైలెట్ ప్రాజెక్టుగా హైదరాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయాల్లో వీడియో ప్రదర్శన అమలు చేయనున్నట్టు ఓ అధికారి తెలిపారు. హెల్మెట్ ధరించకపోవడం వలన జరిగిన యాక్సిడెంట్లు, సెల్ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వలన కలిగే ప్రమాదాలు, అతివేగంతో కూడిన సంఘటనలు, బాధిత కుటుంబాల ఆవేదన తదితర హృదయవిదారక సంఘటనలతో కూడిన వీడియోను ప్రదర్శించి వాహనదారులకు ప్రమాద రహిత డ్రైవింగ్‌పై అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.
డ్రైవింగ్‌పై నియంత్రణ కోల్పోయి ఇతరుల ప్రాణాలను బలితీసుకుంటున్నారు. నగర రహదారులపై స్పీడ్ లిమిట్ నిబంధన ఉన్నప్పటికీ దానిని ఏ మాత్రం పట్టించుకోకుండా దూసుకొస్తున్నారు. రద్దీగా ఉండే రోడ్లపైనా వేగంగా వెళ్లడానికి యత్నిస్తున్నారు. ఇలాంటి క్రమశిక్షణ రాహిత్య డ్రైవింగ్‌తో చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. కేసు నమోదుతో పాటు డ్రైవర్ల లైసెన్స్ రద్దును పరిశీలిస్తున్నారు. అందుకే డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియను ఆర్టీఏ అధికారులు వేగిరం చేశారు. ప్రస్తుతం ఆర్టీఏ అధికారుల ముందర 2412 లైసెన్స్‌లు రద్దు పరిశీలనకు ఉండటం విశేషం. ఇందులో మందుబాబులే అధికంగా రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారని అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో మద్యం సేవించిన వారివే 3012 లైసెన్స్‌లు రద్దయ్యాయి. గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 16,904 లైసెన్స్‌లు రద్దయ్యాయి.