హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో లోపాలు ఉంటే కఠినంగా వ్యవహరిస్తామని, ఈ ఏడాది అనుబంధ గుర్తింపును ఇచ్చేదిలేదని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం హెచ్చరించారు. మంగళవారం జేఎన్టీయూలో తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. పలు కాలేజీల్లో ప్రిన్సిపాళ్లు, ఫ్యాకల్టీ లేరని, సరైన వసతులు లేవని, ఇలాంటి కాలేజీల్లో నాణ్యమైన విద్య ఎలా అందుతుందని తెలిపారు. ఇంజినీరింగ్ పూర్తిచేసిన వారు హోంగార్డులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా మారితే ప్రయోజనమేమిటని ప్రశ్నించారు. ఇంజినీరింగ్ ప్రవేశాల నాటికి కాలేజీలకు అనుబంధ గుర్తింపును జారీచేస్తామని, లోపాలున్న కాలేజీలతో రెండుమూడు రోజుల్లో సమావేశం అవుతామని పేర్కొన్నారు. కాలేజీల్లో బయోమెట్రిక్ హాజరును తప్పనిసరిగా అమలుచేస్తామని చెప్పారు.