వరంగల్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మేడారం మహాజాతర నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ తలపెట్టిన చర్యలు.. ప్రత్యేకించి తల్లుల గద్దెల కైవారం, ప్రాంగణం లోపల, బయట ఆధునికత, అందం పేరుతో రూపొందించిన కొత్త నమూనాలపై ఆదివాసీ సంఘాలు, ఆదివాసీ విద్యార్థి సంఘాల్లో అభ్యంతరం వ్యక్తమైంది. వీటిపై ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలు ప్రచురించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనే కాకుండా ఇప్పుడు కూడా ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్ధంగా జరుగుతున్నదని ఆయా సందర్భాల్లో చోటుచేసుకున్న పరిణామాలను ఏకరువు పెడుతూ సంబంధిత సంఘాల బాధ్యులు వ్యక్తంచేసిన అభిప్రాయాలనే ‘నమస్తే’ తన కథనాల్లో పేర్కొన్నది. అలాగే,
మేడారం మాస్టర్ ప్లాన్ నేపథ్యంగా చోటుచేసుకుంటున్న పరిణామాలను ఎప్పటికప్పుడు ప్రచురిస్తున్నది.
ఇది గిట్టని ములుగు జిల్లాలో కాంగ్రెస్ నాయకులు కొందరు నమస్తే తెలంగాణ పత్రికపై, కథనాలు రాసిన విలేకరులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. శుక్రవారం ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రములో స్థానిక మాజీ సర్పంచ్ ఇర్ప సునీల్‌దొర సహా మరికొందరు నాయకులు మీడియా సమావేశం నిర్వహించి నమస్తే తెలంగాణపై అక్కసు వెళ్లగక్కారు. అబద్ధపు వార్తలు రాయడం మానుకోవాలని, లేదంటే సమ్మక్క-సారలమ్మ తల్లుల శాపం తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. మరోవైపు, తమ జాతి ఆడబిడ్డ, మంత్రి సీతక్క ఉండగానే తమ సంస్కృతికి విఘాతం కలిగితే పరిస్థితి ఏమిటని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్‌కుమార్, ఏఎస్యూ (ఆదివాసీ విద్యార్థి యూనియన్) రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుల రవి సహా పలువురు ఆదివాసీ సంఘాల ప్రతినిధులు ప్రశ్నించారు. మాస్టర్ ప్లాన్‌లో సమ్మక్క-సారలమ్మ గద్దెల కైవారం, ప్రాంగణంలో సాంచీ స్థూపం ఆనవాళ్లా? అని ప్రశ్నించారు. దీనినే నమస్తే తెలంగాణ ప్రముఖంగా ప్రచురించిన విషయం తెలిసిందే.
మాస్టర్ ప్లాన్‌పై మల్లగుల్లాలు నిజం కాదా?
మేడారం మాస్టర్ ప్లాన్‌పై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నది. జూలై 3న దేవాదాయశాఖ రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌ను మేడారంలో నిర్వహించిన సమీక్ష సమావేశం సందర్భంగా పూజారులు, ఆదివాసీ సంఘాలకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చూపించారు. మేడారం మహాజాతర సందర్భంగా ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులపై ఎటువంటి పేచీ లేకపోయినా మేడారం గద్దెల కైవారం, ప్రాంగణంలో రూపొందించిన కొత్త డిజైన్‌పై ఇందులో వ్యతిరేకత వ్యక్తమైంది. దేవాదాయ శాఖ రూపొందించిన కొత్త నమూనా (డిజైన్)లో వలయాకారంలో రాతిపీఠం, శిలాస్థంభాలు కాకతీయ కీర్తితోరణాలను పోలి ఉండటంతో ఆదివాసీలు అభ్యంతరం పెట్టారు. ఇదే విషయాన్ని జూలై 6న నమస్తే తెలంగాణ ‘మేడారంలో అపచారం!’ ఆధునికత పేరుతో సంస్కృతి విచ్ఛిన్నానికి సహించం’ పేరుతో ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఆ తరువాత దేవాదాయ శాఖ మరో గద్దెల ప్రాంగణానికి మరో నమూనాను రూపొందించింది.
గతంలో అభ్యంతరం తెలిపిన నమూనా స్థానంలో కొత్త రూపాన్ని ఇచ్చింది. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలను వరుసగా ఉండేలా శిలా నమూనాలను రూపొందించింది. మంత్రులు కొండా సురేఖ, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ సహా ఉన్నతాధికారులు హైదరాబాద్‌లో దీనిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 4వ తేదీన ‘మేడారంలో మరో అపచారం!’ అనే కథనాన్ని ప్రచురించింది. సర్కార్ రూపొందించిన నమూనాలో సాంచీస్థూపం ఆనవాళ్లు ఉన్నాయని, అది తమ ఆచార సంప్రదాయాలకు విరుద్ధమని పూజారులు, తుడుందెబ్బ, ఆదివాసీ విద్యార్థి సంఘం సహా పలువురు మేధావులు ఆక్షేపించారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 10న ‘మేడారంలో సాంచీ స్థూపం ఆనవాళ్లు?’ అనే ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం ప్రచురితమైన తెల్లారే మంత్రి సీతక్క, ములుగు కలెక్టర్ ఆదివాసీ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. పూర్తిగా ఆదివాసీ, సంస్కృతి సంపద్రాల ప్రకారమే జాతర నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఆ కథనాన్ని కూడా నమస్తే తెలంగాణ ప్రచురించింది. గురువారం మంత్రి సీతక్క మాట్లాడుతూ మేడారం మాస్టర్ ప్లాన్ ఇంకా తుదిరూపు దాల్చలేదని, ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, సమ్మక్క-సారలమ్మ పూజారుల విశ్వాసాలు, లక్షలాదిమంది భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే డీపీఆర్ ఫైనల్ చేస్తామని ప్రకటించిన విషయాన్ని శుక్రవారం నమస్తే తెలంగాణ ప్రచురించింది.
ఆదివాసీ గొంతుకగా అక్షరబద్ధం
మేడారం మహాజాతర నేపథ్యంలో ఇటీవల ప్రభుత్వం రూపొందించిన కొత్త డిజైన్ల (నమూనాలను)ను పూజారులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధుల సమక్షంలో ప్రదర్శించారు. సమీక్ష జరుగుతున్న సమయంలోనే ఈ నమూనాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. ఆ తరువాత చోటుచేసుకున్న పరిణామాలనే నమస్తే తెలంగాణ ఆదివాసీ గొంతుకగా అక్షరబద్ధం చేసింది.
నాడు సీతక్క నిరసననూ లోకానికి చెప్పిన ‘నమస్తే’
ఆధునీకరణ పేరుతో మేడారం జాతరలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తెస్తున్న మార్పులను అడ్డుకట్టవేయాల్సిన ఆదివాసీ బిడ్డ, మంత్రి సీతక్క మౌనం దాల్చడం వెనుక ఆంతర్యం ఏమిటని ఆదివాసీ ప్రతినిధులు ఆవేదన వ్యక్తంచేసిన విషయాన్ని ప్రచురించిన నమస్తే తెలంగాణ.. 2012 జాతర సందర్భంగా నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి గద్దెల ప్రాంగణం ఆవల డప్పు కొట్టినట్టు ఫొటోకు పోజులిస్తే ‘సీఎం అలా చేయడం మా సంప్రదాయాలకు విరుద్ధం’ అని వారించిన సీతక్క అభిప్రాయం, గద్దెల వద్ద పోలీసు కళాజాతపై ఆదివాసీల నిరసన ఫొటోలను నమస్తే తెలంగాణ ప్రచురించించింది.