హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): మలేరియా కేంద్రాల్లో ఫీల్డ్ వరర్లుగా పనిచేసి పదవీ విరమణ చేసినవారికి విధుల్లో చేరిన తేదీ నుంచి సర్వీసును లెకించి, పెన్షన్ చెల్లించాలని 2022 నవంబర్లో ఇచ్చిన తీర్పును అమలు చేయాల్సిందేనని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చిచెప్పింది. లేని పక్షంలో సంబంధిత అధికారులు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మలేరియా ఫీల్డ్ వర్కర్లకు పెన్షన్ చెల్లింపుపై హైకోర్టు జారీచేసిన ఉత్తర్వులు అమలు కావడం లేదంటూ నల్లగొండ జిల్లాకు చెందిన 10 మంది దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్పై జస్టిస్ సూరేపల్లి నంద ఇటీవల విచారణ జరిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేశారు. ఈ లోగా ప్రభుత్వం హైకోర్టు తీర్పును అమలు చేయాలని, లేకుంటే వైద్యారోగ్య, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులతోపాటు ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని స్పష్టం చేశారు.